ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. అయితే అదే ఆదివారం తనకు సెలవు కావాలంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి పై అధికారులకు లేఖ రాశాడు. అదేంటీ.. ఆదివారం ఎలాగూ సెలవే కదా అని తికమక పడకండి. దానికి ఓ కారణం చెప్పాడు అతడు. అయితే లేఖలో మరో విషయాన్ని కూడా ప్రస్తావించాడు. మోహన్ భగవత్, అసదుద్దీన్ ఓవైసీ తనకు గత జన్మలో తెలుసని చెప్పాడు. ఈ భిక్షడమెత్తడమేంటి? మోహన్ భగవత్, అసదుద్దీన్ పేర్లు ఎందుకు? అని అనుకోకండి.. అసలు విషయంలోకి వెళ్దాం..


 మధ్యప్రదేశ్ లోని ఆగ్రా మాల్యా జిల్లా సన్సేర్ తాలూకా.. పంచాయతీ శాఖలో సబ్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు రాజ్ కుమార్ యాదవ్. ఓ సెలవు పత్రాన్ని.. రాశాడు. పని ఒత్తిడి కారణంతో ఆదివారాలు కూడా పని చేయాల్సి వస్తుంది. ఈ మధ్య నాకు ఓ కల వచ్చింది. అందులో అద్భుతమైన విషయాలు తెలిశాయి. ప్రతి ఆదివారం పూర్తిగా ఆథ్యాత్మికతకే పరిమితం అవుతా. ఇగో తగ్గించుకోడానికి.. భిక్షాటన చేస్తాను.. అయితే ఈ కారణాలపై సెలవు కావాలి... అంటూ లేఖ రాశాడు రాజ్ కుమార్. అయితే ఈ లేఖ జిల్లాలో వైరల్ గా మారింది. ఆ లేఖలోని విషయాలు నిజమేనని.. చెప్పేందుకు ఆదివారం ప్రెస్ మీట్ కూడా పెట్టాడు.


లేఖలో రాజ్ కుమార్ ఏం రాశాడంటే..?


‘కొన్ని రోజుల క్రితం నాకు కలొచ్చింది. గత జన్మ గుర్తుకు వచ్చింది. కిందటి జన్మలో మహాభారత కాలంలో పుట్టాను. ప్రస్తుత మజ్లిస్ నేత అసద్దీన్ ఓవైసీ గత జన్మలో పాండవుల్లో ఒకరైన నకులుడు. మేం మంచి మిత్రులం. ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఆ జన్మలో శకుని మామ. ఆ విషయాలన్నీ నాకు గుర్తొచ్చాక.. ఆథ్యాత్మిక చింతన పెరిగింది. టైమ్ దొరికినప్పుడల్లా.. భగవద్గీతా పఠనం చేస్తున్నా. దాని తర్వాత.. అహాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాను. భిక్షం అడుక్కొని నా అహాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నా. పని ఒత్తిడి వల్ల అది కుదరడంలేదు. దయచేసి ఆదివారం రోజున నాకు సెలవిప్పించాలి..’ అని లేఖలో రాసిన విషయాలను రాజ్ కుమార్ చెప్పాడు.





 


ఈ లేఖపై ఆగ్రా మాల్యా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించారు. రాజ్ కుమార్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. అత్యవసర విభాగాల్లోని ఉద్యోగులు అందరూ ఆదివారాలు కూడా పని చేయాల్సిందేనని వెల్లడించారు.


Also Read: Prakash Raj Resign: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!


Also Read: International Day of the Girl Child: ఆడపిల్ల అయితేనేం... ఏం తక్కువ?