చైనాతో సుదీర్ఘంగా సాగిన చర్చలపై భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఇరు దేశాల మధ్య దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు ఈ చర్చలు సాగాయి. తూర్పు లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొల్పేందుకు చైనా- భారత్ మధ్య 13వ విడత చర్చలు జరిగాయి.
ఎల్‌ఏసీ వద్ద ప్రస్తుత పరిణామాలకు చైనా చేసిన దుస్సాహసాలే కారణమని డ్రాగన్‌తో జరిగిన చర్చల్లో భారత్ ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా శాంతి నెలకొల్పాలని భారత సైన్యం అభిప్రాయపడింది.
ఒప్పుకోని డ్రాగన్..
అయితే చర్చల సందర్భంగా భారత్ చేసిన సూచనలు, ప్రతిపాదనలను చైనా తిరస్కరించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. కనుక చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేసింది. అయితే ఇరు దేశాలు ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు, సంయమనం పాటించాలని నిర్ణయించినట్లు ఆర్మీ పేర్కొంది.
ఇరుపక్షాలు సమస్యపై సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. క్షేత్రస్థాయిలో స్థిరత్వం నెలకొనేలా చూడాలని అంగీకరించుకున్నట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి చైనా కృషి చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.
సుదీర్ఘ చర్చలు..
చైనా వైపున ఉన్న చుషూల్ మోల్డో సరిహzద్దు వద్ద ఆదివారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సమావేశం రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగింది. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన చర్చల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద నుంచి బలగాల ఉపసంహరణను పూర్తిచేయడమే ప్రధాన అజెండాగా చర్చించినట్లు సమాచారం.
వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని అనుకుంటోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు పడాలంటే దెప్సాంగ్ సహా అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణ అవసరమని భారత్.. చైనాకు స్పష్టం చేస్తోంది.
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు
Also Read: భార్యపై కోపం.. అత్తామామలకు నిప్పుపెట్టిన అల్లుడు.. కేపీహెచ్‌బీలో దారుణం