మారుతున్న కాలాన్ని బట్టే రోగాలు కూడా పెరుగుతున్నాయి. మనుషులపై ఇట్టే దాడి చేస్తున్నాయి ఎన్నో రకాల బ్యాక్టిరియాలు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. సరైన పోషకాహారం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి అద్భుతమైన ఆహార గని ‘దానిమ్మ’. దీన్ని రోజూ తినమని చెబుతున్నారు హార్వర్డ్ వైద్యులు. ప్రాచీన కాలం నుంచే దానిమ్మ మన ఆహారంలో భాగమైపోయింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. హార్వర్డ్ వైద్యులు అమెరికాలో చాలా తక్కువ మంది పురుషులు వీటిని తింటున్నారని, ఎరుపు విత్తనాలతో నిండిన ఈ పండును తినేందుకు వారెవరూ ఆసక్తి చూపడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అందుకే ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు.
క్యాన్సర్ ను అడ్డుకుంటుంది...
దానిమ్మపంండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ కు దారితీసే కణాల నాశనాన్ని, డీఎన్ఏ దెబ్బతినడాన్ని ఇవి అడ్డుకుంటాయి. ఒకవేళ డీఎన్ఎ, కణాలు డామేజ్ అయినా కూడా త్వరగానే రిపేర్ చేసేస్తాయి. దానిమ్మరసం శరీరానికి హానిచేసే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి మేలు
ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న మగవారు కచ్చితంగా దానిమ్మను రోజూ తింటే చాలా మంచిది. ఇది పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) స్థాయులను స్థిరంగా ఉంచుతుంది. రోజూ దానిమ్మ రసం తాగే మగవారిలో (ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు) చికిత్స తరువాత కూడా పీఎస్ఏ స్థాయిలు స్థిరంగా ఉండడం అనేది దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్టు ఓ అధ్యయనంలో తేలింది. ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడంలో దానిమ్మ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆరోగ్య పరిశోధనల్లో బయటపడింది. కాబట్టి ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్లే కాదు, లేని వాళ్లు కూడా దీన్ని తినడం మొదలుపెడితే మంచితే. భవిష్యత్తులో ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.
గుండెకు భద్రత
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు రెడ్ వైన్, గ్రీన్ టీలలో దొరికే శాతం కన్నా అధికంగా ఉంటాయి. రోజూ దానిమ్మ రసం లేదా గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే దమ్మున్న పండు దానిమ్మ. రోజూ తినలేని వారు కనీసం వారానికి ఓసారి గ్లాసుడు జ్యూసు తాగేందుకు ప్రయత్నించండి. గుండెకు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గర్భిణిలకు...
గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకు దానిమ్మలోని పోషకాలు ఎంతో ప్రయోజనకరంగా మారతాయి. గర్భంలో ఉండగా మెదడు ఎలాంటి గాయాలకు గురికాకుండా చూస్తుంది దానిమ్మలోని లక్షణాలు. అంటే మానసిక ఎదుగుదల బావుంటుంది. ఈ పండులో ఉండే సుగుణాలు మతిమరుపు వ్యాధి, రొమ్ము, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం