అమ్మ గర్భంలో ప్రాణం పోసుకోవడానికి, ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఆడపిల్లయినా, మగబిడ్డ అయినా పోరాటం చేయాల్సిందే. గర్భానికి వివక్ష లేదు. అది ఆడపిల్లను, మగబిడ్డను ఒకేలా కాపాడుతుంది. కానీ పుట్టాకే అసలు కథ మొదలవుతుంది. ఆడపిల్ల అని తెలియగానే ఎందుకో... కొంతమంది ముఖాల్లో నవ్వు ముడుచుకుపోతుంది. ఆ స్థానంలో నిట్టూర్పు వచ్చి కూర్చుంటుంది. నడకలో నిరాశ కనిపిస్తుంది. ఎందుకలా? అవకాశం ఇచ్చి చూడండి, వెన్నంటి ప్రోత్సహించండి... మీ ఆడబిడ్డ ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయం. ఆ విజయం తల్లిదండ్రులుగా మీది కూడా అవుతుంది. సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షను దూరం చేసి, అవగాహన కల్పించేందుకు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 11న నిర్వహించుకుంటున్నాం.
మల్టీటాస్కింగ్ ఆడపిల్లకే సొంతం
కలలు కనే హక్కు, సంపాదించే హక్కు, నిర్ణయాలు తీసుకునే హక్కు... అన్నీ హక్కులు అబ్బాయిలవేనా? ఏ దేశ రాజ్యాంగం చెప్పింది... అమ్మాయిలు వంటింటికే పరిమితమని, ఆడపిల్లలు ఇంటి బాధ్యతలు మోయలేరని. నిజాలు మాట్లాడుకుంటే అబ్బాయిలను మించి మల్టీటాస్కింగ్ చేయగల సత్తా ఆడపిల్లలకే ఎక్కువ. ఇంటి పనులు, వంటపనులు, పిల్లల బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు ఎంత మంది లేరు. పుట్టుక ఒకేలా ఉన్నప్పుడు పెరగడంలో, పెంచడంలో ఎందుకు తేడా? మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే, రెండో సారి కూడా ఆడపిల్ల పుడుతుందేమో అన్న భయంతో రెండో కాన్పు జోలికి వెళ్లని తల్లిదండ్రులు మన దేశంలో కోట్లలో ఉన్నారు. అలాగే మగపిల్లాడు పుట్టే వరకు ఆగకుండా పిల్లలను కంటున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు తమ కూతుళ్లు భవిష్యత్తులో ఓ ఇందిరా గాంధీ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, గుంజన్ సక్సేనా వంటి గొప్పవాళ్లవుతారేమో అని ఆలోచించలేకపోతున్నారు. అలా ఆలోచించిన రోజున ఆడపిల్లలకు మంచి రోజులు వచ్చినట్టే.
అంతెందుకు ఒలింపిక్ క్రీడల్లో రెండు సార్లు దేశానికి పతకం తెచ్చిన పీవీ సింధు తండ్రికి ఇద్దరూ ఆడపిల్లలే. అతను తన కూతురిని విజయాన్ని చూసి ఉప్పొంగిన రోజులు ఎన్నో. మరో బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ కెరీర్ కోసం ఆమె తండ్రి తన జీవితాన్నే ధారపోశాడు. మిథాలీ రాజ్ క్రికెట్ ఎంచుకున్నప్పుడు ఆమె అమ్మనాన్న ‘నువ్వు ఆడపిల్లవి ఇంట్లో కూర్చో’ అని అడ్డుకోలేదు. స్వయంగా తామే కోచింగ్ కు తీసుకెళ్లారు. అవకాశం ఇచ్చి చూడండి మీ కూతుళ్లు కూడా దేశం గర్వించే పనులు చేయగలరు. కొడుకుల్లా మీ బాధ్యతలు పంచుకోగలరు.
గొంతెత్తితే పొగరేనా?
నిజమే... గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. అమ్మాయిలను చదివిస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. రోదసిలోకి దూసుకెళ్తున్నారు. దేశాలను ఏలుతున్నారు. కానీ ఎంత శాతం మంది? చదివించినా కూడా ఎన్ని కుటుంబాలు కూతురికి ఉద్యోగం చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి? పెళ్లి పేరుతో కొత్త ఇంటికి చేరాక ఆడపిల్లల స్వేచ్ఛ అమ్మానాన్నల నుంచి అత్తింటి వారికి చేతులు మారుతుంది. అత్తమామ, భర్త ఒప్పుకుంటేనే ఉద్యోగం చేయాలి. అక్కడ గొంతెత్తితే పొగరు అనే పదంతో కొట్టి పడేస్తారు. ఆడపిల్లలకుండే ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి... సమాజం పెట్టిన పేరు ‘పొగరు’. ఆడపిల్ల పుట్టేది పుట్టింటి గౌరవాన్ని, అత్తింటి పరువును కాపాడటం కోసమేనా? ఆమెకు ఎదిగే అవకాశం ఇవ్వండి. మీ పరువును కాపాడటమే కాదు, ప్రతిష్ఠను పెంచుతుంది.
మీకు తెలుసా
ప్రపంచంలో అయిదు నుంచి 14 ఏళ్ల వయసులోపు ఉన్న ఆడపిల్లలు ఇంటి పనుల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. అదే వయసున్న మగపిల్లలు మాత్రం ఆటలో మునిగి తేలుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో పదిహేనేళ్లకే తల్లి అయిన అమ్మాయిల సంఖ్య 45 లక్షల మందికి పైగా ఉంది.
Also read: శునకాలు మరణాన్ని ముందే పసిగడతాయా? వాటి అరుపులతో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాయా?
Also read: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు