ఒక్కపూట అన్నం పెట్టినా చాలు, ఆ కృతజ్ఞత జీవితాంతం చూపిస్తాయి శునకాలు. అందుకే మనిషికి నమ్మకమైన నేస్తంగా పేరు తెచ్చుకున్నాయి. యజమానులకు, వారి పెంపుడు కుక్కలకు మధ్య చాలా గాఢమైన అనుబంధం ఏర్పడడం సహజమే. మనిషి గ్రహించలేని చాలా చిన్న చిన్న శబ్దాలను, వాసనలను, మార్పులను కూడా శునకాలు తెలుసుకోగలవు. వ్యాధులు, వాతావరణంలో మార్పులను కూడా అవి గ్రహించగలవని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిశాయి. అయితే శునకాలు తమకు ప్రేమను పంచే యజమానుల మరణాన్ని కూడా ముందే పసిగడతాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతేకాదు వారి ఆరోగ్యంలోని మార్పులను కూడా అవి కొంత సమయం ముందే గ్రహిస్తాయని, ఆ సిక్త్ సెన్స్ కుక్కలకు ఉందని వాదించే వాళ్లు ఉన్నారు. అయితే ఇది నిజమని ఇప్పటి వరకు ఏ పరిశోధనా నిర్ధరించలేకపోయింది. కేవలం కుక్కలకే కాదు, పిల్లులకు కూడా ఈ శక్తి ఉందట.
అంత గ్రహణ శక్తి ఎలా?
శునకాల ముక్కును చూడండి... ఎప్పుడు తడిగా, శ్లేష్మంతో కనిపిస్తుంది. ఆ శ్లేష్మమే కుక్కలకు గాలిలోని వాసనను ఇట్టే పసిగట్టే శక్తినిస్తుంది. మన ముక్కులో వాసన పసిగట్టేందుకు కేవలం 60 లక్షల ఘ్రాణ భావాలే ఉండగా, శునకాల్లో మాత్రం 30 కోట్ల ఘ్రాణ భావాలు ఉన్నాయి. అందుకే వాటి వాసన చూసే శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది. అలాగే తనకు దగ్గరగా ఉన్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే కుక్కల వాసన ద్వారా పసిగట్టేస్తాయని చెబుతున్నారు జంతుశాస్త్ర నిపుణులు. అయితే చావును కూడా పసిగడతాయని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేదా చనిపోయిన వ్యక్తి నుంచి వచ్చే వాసనలను శునకాలు గ్రహించగలవని అప్పుడు వాటి అరుపుల్లో తేడా వస్తుందని చెబుతున్నారు. ఎవరైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో, చావుకు దగ్గరలో ఉన్నప్పుడు కుక్కలు కూడా నక్కల్లా ఈలలు వేస్తాయని చాలా సందర్భాల్లో నిరూపణ అయినట్టు చెప్పారు. ఆ విషయాన్ని తెలియజేసేందుకు చాలా ప్రయత్నిస్తాయని, ఎంతకీ తమ అరుపులు ఆపవని వివరిస్తున్నారు. కానీ శాస్త్రీయంగా మాత్రం నిరూపణ కాలేదని చెబుతున్నారు. అంతెందుకు ఇంట్లో యజమాని ఆరోగ్యం బాగోలేనప్పుడు శునకాలు అతని పక్కనే ఉండడం చూస్తూనే ఉంటాం. వాటికి ఎవరు చెప్పారు అతడికి ఆరోగ్యం బాగోలేదని? అతడి శరీరం నుంచి వచ్చే వాసనను బట్టే కదా అవి గ్రహిస్తున్నాయి అని వివరిస్తున్నారు నిపుణులు. యజమాని తనను దగ్గరకు తీసుకున్నప్పుడు అతడి శరీరపు వాసనను పట్టేస్తుంది పెంపుడు శునకం. ఆ వ్యక్తి శరీరంలో ఓ వ్యాధి లేదా అనారోగ్యం దాగినప్పుడు, శరీరం నుంచి వాసనలో స్వల్పమార్పులు కలుగుతాయి. ఇలా గుండె పోటు, క్యాన్సర్, మూర్ఛ, రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం వంటి పరిస్థితులను కూడా కుక్కలు ముందే వాసన ద్వారా గ్రహిస్తాయని అంటున్నారు.
ప్రకృతి మార్పులనూ...
2004లో సునామీ వచ్చినప్పుడు మనుషులు అధికసంఖ్యలో చనిపోయారు కానీ, జంతువులు మరణించిన దాఖలాలు తక్కువే. పాములు, పిల్లులు, కుక్కలు, పక్షులు ఇలా జంతువులు ఎత్తయిన ప్రదేశానికి వెళ్లిపోయినట్టు చాలా కథనాలు తేల్చాయి. భూకంపాలు రావడానికి అయిదు రోజుల ముందే వాటిని జీవులు పసిగడతాయని పరిశోధకులు నమ్మారు. అంటే వాటికి ప్రత్యేక గ్రహణ శక్తి ఉన్నట్టే కదా. మనుషులతో పోలిస్తే చాలా జంతువుల్లో వినికిడి శక్తి, వాసన శక్తి అధికంగా ఉంటుంది. అందుకే కదా మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను గుర్తించడానికి మన అధికార యంత్రాంగం కూడా కుక్కల సాయం తీసుకుంటోంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు
Also read: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి