Maharashtra crisis: మహారాష్ట్రలో శివసేనకు చెందిన మొత్తం ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందాయి. అయితే ఈ జాబితాలో ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్‌నాథ్ శిందే రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.
పోటాపోటీగా ఫిర్యాదు
ఈ నోటీసులపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ 53 మంది శివసేన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్. మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 39 మంది తిరుగుబాటు శిందే వర్గంలో ఉన్నారు. మరో 14 మంది మాత్రమే ఉద్ధవ్ ఠాక్రే వెంట ఉన్నారు.
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన స్పీకర్ ఎన్నిక, సీఎం శిండే బలనిరూపణ సందర్భంగా శివసేన రెండు వర్గాలు పోటాపోటీగా విప్ జారీ చేశాయి. అయితే మరోవైపు విప్‌ను ధిక్కరించినందుకు రెబల్ గ్రూప్ చీఫ్ విప్, శిందే విధేయుడు భరత్ గోగావాలే.. ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
ఉద్ధవ్ వర్గం కూడా విప్ ధిక్కారం, ఫిరాయింపులపై ఫిర్యాదు చేసింది. దీంతో శివసేన ఇరు వర్గాలకు చెందిన 53 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ తెలిపారు.
ఠాక్రే సవాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనను, తన కుటుంబాన్ని దూషించిన వారికి ఠాక్రే కుటుంబంపై గౌరవం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
శివసేన పార్టీ గుర్తును రెబల్స్ ఉపయోగించుకునే అవకాశమే లేదన్నారు. తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
" తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారంలో ఉన్న నాయకులకు సవాల్ విసురుతున్నాను. ఒక వేళ తాము తప్పు చేస్తే ప్రజలు తమను ఇంటికి పంపిస్తారు. ఒక వేళ వారు తప్పు చేస్తే వారిని ఇంటికి పంపించేస్తారు. శివసేన నుంచి పార్టీ గుర్తును రెబెల్స్ తీసుకోలేరు. అయినా ప్రజలు సింబల్‌ను చూడరు. నాయకుల వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారు. శివసేనలో ఉంటూ సొంత పార్టీ నాయకులకు ద్రోహం చేస్తారని ఊహించలేదు. ఇన్ని బెదిరింపులు వచ్చినా తనతో ఉన్న ఎమ్మెల్యేలను చూసి గర్వపడుతున్నాను. "
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం
Also Read: Monsoon Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు- మహారాష్ట్ర, తెలంగాణలో రెడ్ అలర్ట్
Also Read: Udaipur Violence: ఉదయ్‌పుర్ టైలర్ హత్య కేసులో ఏడో వ్యక్తి అరెస్ట్