Sri Lanka Crisis: రాజకీయ, ఆహార, ఆర్థిక సంక్షోభాలతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది మన పొరుగు దేశం శ్రీలంక. అయితే శ్రీలంక పరిస్థితులపై భారత్ స్పందించింది. శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. శ్రీలంకతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు.
అనేక సమస్యలు
ప్రస్తుతం శ్రీలంక అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని జైశంకర్ అన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రధాని విక్రమసింఘే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. జనాగ్రహం చూసి ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి.
ఆందోళనలు ఉద్ధృతం
గత కొంత కాలంగా ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో శనివారం నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. తొలుత వేలాది మంది ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు. అయితే, అంతకుముందే ఆయన తన ఇంటి నుంచి పరారయ్యారు.
ఈ క్రమంలోనే స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుడి భవనంలో భారీగా కరెన్సీ కట్టలు!
Also Read: Shooting In Johannesburg: బార్‌లో విచక్షణా రహితంగా కాల్పులు- 14 మంది మృతి