అమర్ నాథ్ యాత్ర సందర్భంగా ఏపీ నుంచి అక్కడికి వెళ్లిన యాత్రికుల విషయంలో ఆందోళన నెలకొంది. ఈ యాత్ర కోసం వెళ్లిన వారు చాలా మంది వరద, కొండ చరియలు విరిగి పడడం వల్ల గల్లంతయ్యారు. అందులో ఏపీ వాసులు కూడా ఉన్నారు. అయితే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన 84 మంది సురక్షితంగా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీలు వివరాలు తెలుసుకోవాలంటే తాము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.


అమర్‌నాథ్‌ యాత్రికుల వివరాలకు ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ 011-23387089, 1902 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యాత్రికులకు సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హిమన్షు కౌశిక్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.


అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళిన వారి వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన బి.మధు, గుంటూరుకు చెందిన మేదూరు ఝాన్సీ లక్ష్మి, విజయనగరానికి చెందిన వానపల్లి నాగేంద్ర కుమార్ ఉన్నార‌ని పేర్కొంది. వీరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయ‌ని తెలిపింది. ఆచూకీ ల‌భ్యం కాని వారిలో ఇంకా చాలా మంది ఆంధ్ర వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్ళి, వారి నుంచి ఎటువంటి సమాచారమూ రాకపోతే సమీపంలోని ప్రభుత్వ అధికారులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని సూచించారు.


ఇప్పటిదాకా 16 మంది దుర్మరణం
అమర్ నాథ్ క్షేత్రానికి వెళ్లే దారిలోని బేస్ క్యాంపు వద్ద గుడారాల్లో యాత్రికులు ఉండగా, వరదలు సంభవించాయి. దీంతో ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది చనిపోయినట్లుగా అక్కడి అధికారులు ప్రకటించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు వంద మంది వరకూ గాయపడ్డారు. ఆచూకీ గల్లంతైన వారిని కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సీఆర్పీఎఫ్ ను రంగంలోకి దించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా 16 మంది చనిపోయిన వారిని కనుగొన్నారు. వరదల ప్రభావంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేయగా, ఇప్పటికే అక్కడికి చేరుకున్న వేలాది మంది యాత్రికులు మళ్లీ దర్శన పునరుద్ధరణ కోసం వేచి చూస్తున్నారు.