Monsoon Alert: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భార వర్షాల ధాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పలు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. అయితే మరో ఐదు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) హెచ్చరించింది.






రెడ్ అలర్ట్


మరో ఐదు రోజులపాటు దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎమ్‌డీ పేర్కొంది.






మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గడ్చిరౌలిలోని 130 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు నాందేడ్‌, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు  పడుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌లు జారీ చేశారు.


దీంతో రాష్ట్రంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం, మంగళవారం, బుధవారం మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. 


ఆ రాష్ట్రాల్లో


హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ, చంబా జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చాయి. 


Also Read: Udaipur Violence: ఉదయ్‌పుర్ టైలర్ హత్య కేసులో ఏడో వ్యక్తి అరెస్ట్


Also Read: Sri Lanka Crisis: 'శ్రీలంకకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం- ప్రస్తుతానికి ఆ సమస్య లేదు'