Udaipur Violence: ఉదయ్‌పుర్ టైలర్ హత్య కేసులో ఏడో వ్యక్తి అరెస్ట్
Udaipur Violence: ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో మరో వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
Udaipur Violence: రాజస్థాన్ ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో ఏడో వ్యక్తిని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు ఫర్హాద్ మహ్మద్ షేక్‌గా అధికారులు తెలిపారు. హత్యకు ముందు నిందుతులతో ఫర్హాద్ భేటీ అయినట్లు సమాచారం. దీంతో శనివారం రాత్రి ఇతడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏడుగురు అరెస్ట్
ఈ కేసులో హంతకులు రియాజ్ అక్తర్, మహ్మద్ గౌస్‌లతో సహా ఇప్పటివరకు ఏడుగురును అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ. హత్యకు ముందు కన్హయ్య లాల్ కదలికలపై నిఘా పెట్టి, అతని దుకాణం వద్ద రెక్కీ నిర్వహించిన మహ్మద్, ఆసీఫ్‌లను కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
ఇదీ జరిగింది
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజస్థాన్ ఉదయ్‌పుర్ మాల్దాస్‌లో ఈ ఘటన జరిగింది.
ఉగ్ర సంస్థ ఐసిస్ ముష్కరులను తలపించేలా టైలర్ గొంతు కోసి క్రూరంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భాజపా సస్పెండ్ చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామని హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలానే చేస్తామని హెచ్చరించారు.
వెంటనే అరెస్ట్
ఈ దారుణానికి తెగబడిన నిందితులు రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. రియాజ్.. టైలర్ గొంతు కోయగా, గౌస్ దీనిని అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనపై రాజస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిందితులను ఉరి తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఉదయ్‌పుర్ సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది.
Also Read: Sri Lanka Crisis: 'శ్రీలంకకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం- ప్రస్తుతానికి ఆ సమస్య లేదు'
Also Read: Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుడి భవనంలో భారీగా కరెన్సీ కట్టలు!