Anakapalli News : అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై పెద్దనాన్న వరసైన వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డపాలెం గ్రామానికి చెందిన బాలిక(16) ఇటీవలే పదోతరగతి పాస్ అయింది. పరీక్షలు పూర్తైన తర్వాత ఇంట్లో ఉంటున్న ఆమెపై సమీప బంధువు చేపల చిట్టిబాబు(42) కన్నేశాడు. మాకవరపాలెం మండలం నగరం గ్రామంలో స్నేహితురాలి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉండడంతో బాలిక అక్కడకు వెళ్లడానికి సిద్ధమయింది. బాలికను ఒంటరిగా పంపలేక తల్లిదండ్రులు చిట్టిబాబును తోడుగా వెళ్లాలని కోరారు. ఇదే అదునుగా భావించిన చిట్టిబాబు మే 12న బాలికను తీసుకుని కారులో వెళ్లాడు. స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్ పూర్తయిన తర్వాత బాలికను తిరిగి గజిరెడ్డపాలేనికి తీసుకువస్తూ మార్గమధ్యలో కారు ఆపి బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక భయంతో ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత కూడా చిట్టిబాబు బాలికను వేధించడంతో ఆమె తల్లిదండ్రులు జరిగిన విషయం తెలిపింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


మహిళా కమిషన్ ఆగ్రహం 


అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం బాలికపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమీశాలితో ఆదివారం ఫోన్ లో మాట్లాడారు. వాసిరెడ్డి పద్మ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై పెదనాన్న వరుసయ్యే చేపల చిట్టిబాబు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని, తక్షణమే విచారించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ గౌతమీశాలి తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని బాధితురాలికి వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు. బాధితురాలి బంధువులు చిట్టిబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయంపై వేగవంతంగా దర్యాప్తు పూర్తిచేసి నిందితుడికి శిక్షపడేలా చేయాలని వాసిరెడ్డి పద్మ ఎస్పీని ఆదేశించారు. 


ఎంతటి వారైనా వదలొద్దు 


నేరానికి పాల్పడిన చేపల చిట్టిబాబు టీడీపీ నేతగా తెలిసిందని నేరస్తులు ఎంతటి వారైనప్పటికీ తక్షణమే అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. అభంశుభం తెలియని బాలికలను వేధించే ఇలాంటి నీచులకు రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచి ప్రోత్సహించరాదన్నారు. అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. అదేవిధంగా బాధిత బాలిక ఆరోగ్యం కుదుటపడేవరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కమిషన్ ఛైర్ పర్సన్ ఆదేశాలతో అనకాపల్లి జిల్లా మహిళా కమిషన్ సభ్యులు గెడ్డం ఉమ బాధిత బాలికను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే టీడీపీ నుంచి చిట్టిబాబు సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.