ప్రతిపక్షాలే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా..?
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమ్‌సింఘే..ప్రజల డిమాండ్‌లకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. మరి నెక్స్ట్ ఏంటి..? ఈ ద్వీప దేశంలో ఎవరు అధికారం చేపడతారు..? ఈ రాజకీయ అస్థిరతకు తెర పడుతుందా..? అన్న సందేహాలు చర్చకు వస్తున్నాయి. ఆల్‌పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న వార్తలైతే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. లంక రాజ్యాంగం ప్రకారం...పార్లమెంట్ స్పీకరే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అయితే స్థిరమైన ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటవుతుందన్నదే ఇంకా స్పష్టత రావట్లేదు. రాజకీయ పరంగా ఇక్కడ ఉన్న వాక్యూమ్‌ను ఎవరు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేధోమథనం సాగిస్తున్నాయి. ఇదే విషయమై భేటీ కూడా అయినట్టు సమాచారం. ఎంపీ, న్యాయవాది ఎమ్‌ఏ సుమందిరన్ వ్యాఖ్యల ఆధారంగా చూస్తే...ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే పార్లమెంట్‌కు కావాల్సిన 113 మంది సభ్యుల మెజార్టీ తప్పకుండా వస్తుంది. వీరంతా ఏకాభిప్రాయానికి వచ్చి..అధ్యక్ష పదవి నుంచి గొటబయ రాజపక్స దిగిపోక ముందే, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేసే అవకాశముంది. దాదాపు అన్ని పార్టీలు ఇందుకు అంగీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆల్‌పార్టీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే తాను వెళ్లిపోతానని ఇప్పటికే ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స జులై 13వ తేదీన రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ఇప్పుడు ఆల్‌పార్టీ మీటింగ్ తరవాత కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని వీలైనంత త్వరగా దారికి తెచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీ దుల్లాస్ అలహప్పెరుమా ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో నాలుగు నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. గొటబయ రాజపక్స, రణిల్ విక్రమసింఘేను వెంటనే గద్దె నుంచి దించాలని, ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంట్ స్పీకర్ మహింద అబివర్దనె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగేలా తీర్మానించనున్నారు. వారం రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని నియమించుకుని పూర్తి స్థాయిలో పార్లమెంట్ కార్యకలాపాలు మొదలు పెట్టాలనీ ఈ సమావేశంలో నిర్దేశించుకున్నారు. ఆ సమయంలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కూడా జరిగిపోవాలని నిర్ణయించారు. అంటే మరో వారం, పది రోజుల్లో శ్రీలంకలో రాజకీయ అస్థిరతకు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం వచ్చినంత మాత్రాన అక్కడి ప్రజలకు కలిగే ప్రయోజనాలేమీ లేవన్నది ఓ వాదన. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడి, ఆ ఇబ్బందుల నుంచి దేశాన్ని బయట పడేసే పాలకుల అవసరం చాలానే ఉంది. సవాళ్లు స్వాగతం పలుకుతున్న ఈ సమయంలో ఆల్‌పార్టీ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది..? ప్రజాగ్రహాన్ని ఎలా తగ్గిస్తుంది..? అన్నది వేచి చూడాల్సిందే.
Also Read: ABP Centenary Celebration: ప్రజలే మాకు ముఖ్యం, సామాన్యులకు సేవ చేయటమే మా అజెండా: ఏబీపీ చీఫ్ ఎడిటర్