కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఒక్క శనివారం నాడే ఐదుగురు మరణించారని, కనీసం 20 మంది గల్లంతయ్యారు. కేరళలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు కూలాయి. వరదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకొని సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
కేరళలో చాలా ప్రాంతాల్లో రెండు గంటల వ్యవధిలోనే 5 సెంటీ మీటర్ల తీవ్ర వర్షం కురిసిందని వాతావరణ అధికారులు చెప్పారు. పీర్‌మేడ్ అనే ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధిక వాన కురిసిందని, అక్కడ ఏకంగా 24 సెంటీమీటర్ల వాన పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వర్షాల ప్రభావం అధికంగా చెరుతోని, చలాకుడి, పూంజర్ ప్రాంతాల్లో ఉండగా.. ఇక్కడ సరాసరిన 14 సెంటీమీటర్ల వర్షం పడింది. శనివారం కేరళలో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ విభాగం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికే 74 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబరు 7 నుంచి అక్టోబరు 13 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 166 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ నివేదిక వెల్లడించింది.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!
వరదల కారణంగా జనావాసాల్లోకి వచ్చిన నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇంకొదరు గాయపడ్డారు. జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా.. కొండ ప్రాంతాల్లో ఉండే పట్టణాలు, గ్రామాలు బాహ్యప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటిదాకా కొట్టాయం, పతానంతిట్ట జిల్లాలు వరదలకు విపరీతంగా ప్రభావితం అయ్యాయి. పరిస్థితి చాలా విషాదకరంగా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.
కొట్టాయం, ఇడుక్కి, పతానంతిట్టలో ఆర్మీ, వైమానిక దళ హెలికాప్టర్లను రంగంలోకి దింపి సహాయ కార్యక్రమాలను సాగిస్తున్నారు. పంగోడే స్థావరం నుంచి ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలకు సాయం అందిస్తున్నారు. పరిస్థితి మరీ చేయి దాటితే అదనపు సాయం కోసం ఎంఐ-17, సారంగ్ హెలికాప్టర్లను సూలూర్ వైమానిక స్థావరంలో సిద్ధంగా ఉంచారు. అయినా, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లు ఎగిరేందుకు కూడా కొన్నిసార్లు అంతరాయం ఏర్పడుతోంది. సదర్న్ ఎయిర్ కమాండ్ పరిధిలోని అన్ని రక్షణ స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచినట్లుగా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరోవైపు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన వరదలు, సహాయక చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం శనివారం సాయంత్రం జరిగింది.
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!
Also Read: Weather Update: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు