Motkupalli Narasimhulu: సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో మోత్కుపల్లి చేరనున్నారని తెలుస్తోంది. ఇటీవల దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటాడని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారని సమాచారం.


రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్నత పదవులు చేపట్టిన ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేదని... అన్యాయం జరిగిందని బీజేపీకి రాజీనామా సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. పార్టీలో తన నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం లేదని, నిస్వార్థంగా సేవ చేసేందుకు బీజేపీలో చేరానని.. అది జరిగే పరిస్థితి లేదన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న తన సేవలు వినియోగించుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఇటీవల ఘాటుగా విమర్శించారు. తనకు కనీసం బీజేపీ కమిటీలో కూడా స్థానం కల్పించకపోవడంతో కమలం పార్టీని వీడారు. అయితే అదే సమయంలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు.


Also Read: ఇక ఫుల్ టైమ్ అధ్యక్షురాలిని.... సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు... జీ-23 నేతలకు క్లాస్ 


యాదాద్రి భువనగిరి జిల్లా (ఉమ్మడి నల్గొండ) ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడిన తరువాత తన మార్గమేంటో చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ప్రశంసించిన సందర్భంలో టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావించారు. కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ టీఆర్ఎస్‌లో చేరి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడమేనని కథనాలు సైతం వచ్చాయి. 


Also Read: హజూరాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి !


దళితవాదంతో టీఆర్ఎస్ గూటికి..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దళితబంధు అస్త్రాన్ని ప్రయోగించారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మేర ఆర్థిక ప్రయోజనం అందించి వారి జీవితాలను మార్చాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సిహులును టీఆర్ఎస్‌లో చేర్చుకుని ఆ పథకానికి సంబందించిన కీలక బాధ్యతలు మోత్కుపల్లికి అప్పగించనున్నారని తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. తమ పార్టీలో చేరనున్న మోత్కుపల్లికి ఎమ్మెల్సీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read: ఇక ఫుల్ టైమ్ అధ్యక్షురాలిని.... సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు... జీ-23 నేతలకు క్లాస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి