టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్‌కి సంబంధించిన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మనదేశంలో వచ్చే సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అందుబాటులోకి వస్తే.. భారతీయ వినియోగదారులకు హైస్పీడ్ డేటా లభించనుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.
ప్రముఖ స్పీడ్ టెస్ట్ యాప్ కంపెనీ ఊక్లా.. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం.. కొన్ని దేశాలకు సంబంధించిన వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ యావరేజ్‌ను స్టార్ లింక్ ఇప్పటికే క్రాస్ చేసింది.
స్టార్ లింక్ విడుదల తేదీ
స్పేస్ఎక్స్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ యూనిట్ మనదేశంలో తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను 2022 డిసెంబర్‌లో లాంచ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. రెండు లక్షల యాక్టివ్ టెర్మినల్స్, గవర్నమెంట్ అప్రూవల్‌తో ఈ సేవలు లాంచ్ కానున్నాయి. ఎలాన్ మస్క్ కంపెనీ ప్రెసిడెంట్ గ్వెన్ షాట్‌వెల్ తెలిపిన దాని ప్రకారం.. స్పేస్ఎక్స్ ఇప్పటికే 1800 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. అవి తమ ఆపరేషనల్ ఆర్బిట్‌ను చేరుకున్న తర్వాత.. స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులు గ్లోబల్ కవరేజ్‌ను అందించడం ప్రారంభిస్తాయి.
మనదేశంలో స్టార్ లింక్ ధర, యాక్టివేషన్ కిట్
బీటా స్టేజ్‌లో కంపెనీ ప్రతి వినియోగదారుడి నుంచి 99 డాలర్లు(సుమారు రూ.7,350) వసూలు చేయనుంది. 50 ఎంబీపీఎస్ నుంచి 150 ఎంబీపీఎస్ వేగాన్ని ఇవి అందించనున్నాయి. స్టార్‌లింక్ కిట్‌లో స్టార్‌లింక్, ఒక వైఫై రూటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపోడ్ ఉండనున్నాయి. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకున్న లొకేషన్ తెలుసుకోవడానికి ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో స్టార్ లింక్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
స్టార్ లింక్ ప్రీ-ఆర్డర్లు
దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రస్తుతానికి ఇవి బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి. స్టార్ లింక్ వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. అహ్మదాబాద్ (గుజరాత్), తాడేపల్లి గూడెం (ఆంధ్రప్రదేశ్), ఇండోర్ (మధ్యప్రదేశ్)ల్లో మాత్రమే ప్రస్తుతానికి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొదట బుక్ చేసుకున్న వారికి మొదట సేవలు లభిస్తాయని కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది.
ఇప్పటివరకు మనదేశంలో స్టార్ లింక్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి ఐదు వేల వరకు ప్రీ-ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఇండియా డైరెక్టర్ సంజయ్ భార్గవ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
స్టార్‌లింక్ వర్సెస్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్
భారతదేశంలో జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో స్టార్ లింక్ నేరుగా పోటీ పడనుంది. ఎక్కడైతే నెట్‌వర్క్ కనెక్టివిటీ అందించడం కష్టమో.. అటువంటి ప్రాంతాలకు ఈ సేవలు సరిగ్గా సరిపోతాయని స్టార్ లింక్ తెలిపింది. పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు తెలుపుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్సులు, అనుమతులు అన్నీ తీసుకోవాలని కేంద్ర టెలికాం శాఖ స్టార్‌లింక్‌కు తెలిపింది. మనదేశంలో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ లాంచ్‌కు అనుమతినివ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే భారతదేశ వినియోగదారులకు సేవలందించే ముందు దేశంలోని చట్టాలు, నియమాలను పాటించాలని పేర్కొంది.
Also Read: Smart Watch Offers: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు
Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?