Hathras District Magistrate issues helpline numbers | హాథ్రస్: ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ విషాదంపై దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖ నేతలు తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. భోలే బాబా సత్సంగం కార్యక్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఇటా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగిద్యనాథ్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.


హాథ్రస్ జిల్లా కలెక్టర్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాట్లు చేశారు. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలు తెలుసుకోవడానికి, వివరాలు తెలపడానికి ప్రజల అవసరార్థం హెల్ప్ లైన్ నెంబర్లు 05722227041, 05722227042 ఏర్పాటు చేశారు. ఈ నెంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవడంతో పాటు బాధితుల సమాచారం అందించాలని ప్రజలకు హాథ్రస్ కలెక్టర్ సూచించారు. తొక్కిసలాట ఘటనకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 






రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి..
ప్రజల ప్రాణాలకు యోగి ప్రభుత్వంలో భద్రత లేకుండా పోయిందని, హాథ్రస్ ఘటనపై మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. తొక్కిసలాట జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఈ స్థాయిలో మరణాలు సంభవించాయంటే అందుకు యోగి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఓ కార్యక్రమానికి హాజరైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వారికి భద్రత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. బాధితులకు తాము అండగా ఉంటామని పీటీఐతో మాట్లాడుతూ ఎప్పీ చీఫ్ అఖిలేష్ అన్నారు.