Telangana News | హైదరాబాద్: స్కూల్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నానంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattadreya) ఆటోబయోగ్రఫీ “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బండారు దత్తాత్రేయతో అనుబంధాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

ఎన్ని పదవులు వరించినా ప్రజలకు దూరం కాలేదు

శిల్పకళా వేదికలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా.. అన్ని పార్టీలకు బండారు దత్తాత్రేయపై గౌరవం ఏమాత్రం తగ్గదు. పార్టీలకు అతీతంగా అంతా ఆయనను గౌరవిస్తారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా వెనకడుకు వేయని నేత దత్తాత్రేయ. గౌలీగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఆయనది సుదీర్ఘ ప్రయాణం. జీవితంలో ఎన్నో పదవులు వరించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదు. దత్తాత్రేయ గారితో వ్యక్తిగతంగా నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయనను చాలా దగ్గరగా చూశాను. చిన్న చిన్న వేడుకల్లో కూడా భాగమై సామాన్యులకు అందుబాటులో ఉండే గొప్ప నేత ఆయన.

ప్రధాని మోదీతో రేవంత్ చెప్పిన మాటనా స్కూల్ బీజేపీలో అయితే, కాలేజీ చంద్రబాబు దగ్గర, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని మొన్నామధ్య ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధాని మోదీకి చెప్పాను. ఇతర పార్టీల నేతలతో రాజకీయంగా ఎలా ఉన్నా, వ్యక్తిగత సంబంధాలను దాచాల్సిన అవసరం లేదు. నేడు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంది. ఆ కార్యక్రమం పూర్తికాగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చాను. అజాత శత్రువు అనే పదం బండారు దత్తాత్రేయకి సరిగ్గా సరిపోతుంది. దేశంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిలా, రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ అలా ఉన్నారు. 

అందరినీ ఏకం చేసేందుకు దత్తన్న కార్యక్రమం

రాజకీయాలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరవుతారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు దత్తాత్రేయ నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. హైదరాబాద్ సికింద్రాబాద్జంట నగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది నేతల్లో ఒకరు పీజేఆర్ అయితే, మరొకరు దత్తాత్రేయ. గతంలో తిరుపతి దర్శనాల కోసం, రైల్వే రిజర్వేషన్ల కోసం దత్తాత్రేయ వద్ద సిఫార్సు లేఖలు తీసుకునేవాళ్లం. మాలాంటి ఎంతో మందికి ఆయన సాయం చేశారు. మేం తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.