Prabhakar Rao in Phone Tapping Case | హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా నుంచి ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జూన్ 9న సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం సైతం ఉంది.
15 నెలల తరువాత హైదరాబాద్‌కు
లుకౌట్ నోటీసులు ఉండటంతో విచారణ అధికారులకు సమాచారం అదింది. క్లియరెన్స్ రావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చేశారు. 15 నెలల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి రావడానికి అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ కావడంతో ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. గత ఏడాది మార్చి 10న ప్రభాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగా, మార్చి 11న అమెరికాకు వెళ్లి, ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు.
కోర్టు ఆదేశాలు, పర్మిషన్‌తో అమెరికా నుంచి రాక
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రభాకర్ రావు పాస్‌పోర్టు రద్దు చేసింది. అతడు భారత్‌కు తిరిగొచ్చేందుకు ట్రావెల్ డాక్యుమెంట్ జారీ, లేక పాస్ పోర్ట్ తిరిగివ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ బి.వి నాగరత్నల బెంబ్ విచారించింది. పాస్‌పోర్టు లేక సంబంధిత అనుమతి పత్రం అందిన 3 రోజుల్లో భారత్‌కు తిరిగి వస్తానని ప్రభాకర్ రావు కోర్టుకు రాతపూర్వక హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేశారు.