Maganti Gopinath Last Rites: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు
జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించింది.
అంతిమయాత్రలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాడె మోశారు. మాదాపూర్ లోని నివాసం నుంచి మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర మొదలై ర్యాలీగా మహాప్రస్థానానికి చేరుకుంది.
మాగంటి గోపీనాథ్ తనయుడు తండ్రి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ అంత్యక్రియల్లో పలు పార్టీల నేతలు, మాగంటి గోపీనాథ్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
జూన్ 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు మాగంటి కుటుంబాన్ని పరామర్శించారు.