దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. రోజూవారీ కేసులు తగ్గుతున్నాయి. తాజా కేసులు నిన్నటి కన్నా కాస్త పెరిగినా కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 మందికి కరోనా సోకింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,74,773 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 3,19,551 యాక్టివ్ కేసులు ఉండగా, 3,17,20,112 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
యాక్టివ్ కేసులు 1.29 శాతం మాత్రమే
సోమవారం కరోనాతో 354 మంది చనిపోయారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,35,110కు చేరింది. తాజాగా 39,486 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా, రికవరీ రేట్ 97.37 శాతం ఉంది. దేశంలో కరోనా కేసుల క్రియాశీల రేటు తగ్గింది. రికవరీ రేటు మెరుగ్గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు ఒక శాతం దిగువకు వచ్చింది. 2020 మార్చి తర్వాత క్రియాశీల రేటు ఇంతలా తగ్గడం ఇదే తొలిసారి.
58.89 కోట్ల డోసులు పంపిణీ
దేశంలో కొత్తగా 25,467 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సోమవారం 63,85,298 మంది కోవిడ్ టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే దేశంలో 16,47,526 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 50,91,98,925కి చేరినట్లు చెప్పింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
కరోనా వైరస్ థర్డ్ వేవ్ సంకేతాల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 5,13,864 మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైరస్ధాటికి మరో 7585 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,32,79,064కి చేరాయి. మరణాల సంఖ్య 44,53,064కు పెరిగింది.