దేశంలో కరోనా థర్ఢ్ వేవ్ రానుందని హెచ్చరికలు వస్తోన్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థర్ఢ్ వేవ్ ఉద్ధృతి ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి పడకకూ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 వేల బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా.. తాజాగా మరో 10 వేల పడకలకు ఆక్సిజన్ ఫెసిలిటీ అందించనుంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇక ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ కనీసం 20 బెడ్లతో కూడిన ఐసీయూను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థర్ఢ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో.. 20 శాతం బెడ్లను చిన్నారుల కోసం కేటాయించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది.
ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్..
సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు.. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ సొంత ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించడానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం సహా కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలో 2 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలకు సూచించింది.
బెడ్ల సంఖ్యను బట్టి ప్లాంట్..
ఆస్పత్రికి కేటాయించిన బెడ్ల సంఖ్యను బట్టి ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పాలనే యోచనలో ఆరోగ్య శాఖ ఉంది. 100 నుంచి 200 బెడ్లు ఉన్న ఆసుపత్రుల్లో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 200 నుంచి 500 మధ్య బెడ్లు ఉన్న ఆసుపత్రుల్లో నిమిషానికి వెయ్యి లీటర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును నిర్మించనుంది. ఇక 500 పడకలు దాటితే నిమిషానికి 2000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
సెప్టెంబరులో రోజుకు 5 లక్షల కేసులు..
కరోనా థర్డ్ వేవ్ రావడం తథ్యమని.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని వణికించే ప్రమాదం ఉందని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. సెప్టెంబరులోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. థర్డ్ వేవ్ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాయి.