తెలుగు రాష్ట్రాల్లో వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో వర్షాలు
ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని భారత వాతవరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
Also Read: Horoscope Today: ఈ రాశులవారికి కొత్తగా చేపట్టే పనులతో ప్రయోజనం.. వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా సోమవారం భారీ వర్షాలు కురిశాయి.
అప్రమత్తంగా ఉండండి
మరో అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. అత్యవసర సేవలు అందించడానికి డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు విభాగాల అత్యవసర బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సి ఫోన్ నంబర్లు
- ఎన్డీఆర్ఎఫ్ ఎమర్జెన్సీ : 8333068536, 9121240141, 9000113667
- జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ : 97046018166, 9000113667, 6309062583
- పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్: 100
- విద్యుత్ శాఖ ఎమర్జెన్సీ నెంబర్ : 9440813750