టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజ్‌రంగ్ పునియా అక్టోబరులో జరిగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ... డాక్టర్ల సలహా మేరకు తాను ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కి దూరమౌతున్నట్లు ప్రకటించాడు. అక్టోబరు 2 నుంచి 10 వరకు నార్వేలోని ఓస్లోలో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో భజ్‌రంగ్ పునియాకు గాయమైంది. టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు డాక్టర్ దిన్షా పర్దివాలాను కలిశాడు. అతని పర్యవేక్షణలో ఉండి కోలుకుని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. గాయం నొప్పిని భరిస్తూ పునియా పోటీల్లో పాల్గొన్నాడు. చివరికి కాంస్య పతకంతో దేశానికి తిరిగి వచ్చాడు. తాజాగా మరోసారి దిన్షా సూచన మేరకు MRI స్కాన్ చేయించుకున్నాడు పునియా. స్కాన్ రిపోర్టు చూసిన దిన్షా... పునియాకు ఆరు వారాల విశ్రాంతి సూచించాడు. దీంతో అతడు అక్టోబరు 2 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు దూరమవ్వాల్సి వచ్చింది.
రెజ్లర్లకు రెనాల్ట్ కైగర్ SVU కానుక
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత రెజ్లర్లు లవ్లీనా, భజ్‌రంగ్ పునియా, రవి కుమార్ దహియాకు రెనాల్ట్ వారు కైగర్ SUVలను కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రెనాల్ట్ ప్రతినిధులు ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు కూడా కైగర్‌ను అందించిన సంగతి తెలిసిందే.