భారత్‌లో అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తుంది. భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ మండలి) అనుమతినిచ్చింది. అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి భారత్ బయోటెక్ కొవిడ్ టీకాను త్వరలో వేయనున్నారు. పిల్లలకు ఇండియాలో మొదటి టీకా కొవాగ్జిన్ అవనుంది.
'భారత్ బయోటెక్ కొవాగ్జిన్ 12 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి పొందింది' అని ANI తెలిపింది. అంతకుముందు భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారికి.. వ్యాక్సినేషన్ కోసం క్లినికల్ ట్రయల్స్ డేటాను..సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమర్పించింది.
ఇటీవలే సీరం సంస్థ ప్రకటన
కొవిడ్ మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆరు నెలల్లోనే పిల్లల టీకాను తీసుకురాబోతున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇటీవలే ప్రకటించారు. కొవొవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.
" మరో ఆరు నెలల్లో చిన్నారుల కోసం కొవిడ్ టీకా తీసుకురానున్నాం. అదృష్టవశాత్తు చిన్నారుల్లో కొవిడ్ తీవ్రమైన అనారోగ్యం కలిగించడం లేదు. ఇప్పటికే భారత్‌లో రెండు కంపెనీలకు చెందిన కొవిడ్ టీకాలు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి పొందాయి. చిన్నారులకు టీకా వేయించాలనుకునే వారు ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. 3 ఏళ్లు పైబడిన చిన్నారులను ఈ టీకా ఇవ్వొచ్చు. "
-అదర్ పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ
ప్రస్తుతం సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు. కొవిడ్ వంటి మహమ్మారులపై పోరాడే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని పూనావాలా అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు.
Also Read: Karnataka Corona Cases: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
Also Read: Omicron Cases: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!
Also Read: Omicron Treatment: ఒమిక్రాన్ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!