ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఒమిక్రాన్.. దేశంలోనూ.. విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే.. రాజస్తాన్ లో 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరుకుంది. అయితే ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి ఒమిక్రాన్ సోకింది. రాజస్థాన్ లో మెుత్తం 43 కేసులు నమోదు కాగా.. అందులో 28 కేసులు.. జైపుర్ లోనివే. అజ్మేర్‌లో 7, సికర్‌ 4, ఉదయ్‌పుర్‌లో 3 కేసులు నమోదయ్యాయి.


ఉత్తరప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశంలో మెుత్తం వేరియంట్ల సంఖ్య 437కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు ఉన్నాయి. ఢిల్లీ 79, గుజరాత్‌ 43 కేసులు బయటపడ్డాయి.


ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించాలని చెప్పింది.  మరోవైపు వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతో పాటు ఆంక్షలు విధిస్తున్నాయి. అసోం ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ప్రతిరోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ఈ ఆంక్షలను మినహాయింపునిచ్చారు.


కర్ణాటకలో వైద్య విద్యార్థులకు కరోనా


కర్ణాటక రాష్ట్రంలో కరోనా కలకలం రేపింది. కోలార్ శ్రీ దేవరాజ్ ఉర్స్ మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. విద్యార్థుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారని జిల్లా సర్వైలెన్స్ అధికారిణి డాక్టర్ చరణి తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల ప్రయాణ హిస్టరీలేదని తెలుస్తోంది. అయితే బెంగళూరులో ప్రయాణం ఆరా తీస్తున్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. కళాశాల యాజమాన్యం ప్రకారం గత 45 రోజులుగా ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులెవరూ స్వగ్రామాలకు వెళ్లలేదని డాక్టర్ చరణి తెలిపారు. విద్యార్థులు ఉంటున్న బ్లాక్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైద్య విద్యార్థులందరినీ ఆర్‌ఎల్‌ జలప్ప ఆసుపత్రిలో ఐసోలేట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కోవిడ్ సోకిన విద్యార్థుల ప్రైమరీ, సెంకండరీ కాంటాక్ట్ర్  1192 లను గుర్తించామని వైద్యులు తెలిపారు. 


Also Read: Karnataka Corona Cases: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్


Also Read: Agriculture Laws: అయిపోలేదు.. ఇంకా ఉంది.. వ్యవసాయ చట్టాలు మళ్లీ తెస్తాం .. కేంద్రమంత్రి కీలక ప్రకటన !


Also Read: ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేయండి.. బుల్లెట్టు గెలవండి! మరో రూ.లక్ష కూడా పొందొచ్చు.. కేంద్రం ఆఫర్‌!!