ఆపరేషన్ సింధూర్‌లో భారత్, పాక్‌పై విజయం సాధించింది. ఇప్పుడు చర్చంతా ఒక్కటే: భారతీయ ఆయుధ వ్యవస్థలు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన వ్యవస్థలను ఈ ఆపరేషన్‌లో వినియోగించడంపైనే. ఇదే మాట పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ చెప్పడం విశేషం. తాను ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడినప్పుడు, ఆపరేషన్ సింధూర్‌లో మన దేశీయ తయారీ ఆయుధ వ్యవస్థలు, సైనిక పరికరాల పనితీరును వారు ప్రశంసిస్తున్నారని చెప్పడం ఆసక్తికరం. అయితే, ఈ ఆపరేషన్ సింధూర్‌లో మన దేశీయ సాంకేతికత, ఆయుధ వ్యవస్థలు ఏం వినియోగించారో ఈ కథనం చదివితే తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చదివి ఈ అంశాలను తెలుసుకుందాం.

ఆపరేషన్ సింధూర్‌లో  స్వదేశీ సాంకేతికత వినియోగం

దేశంలో ఓవైపు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య వార్ సాగుతోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య పరిమిత యుద్ధం జరిగింది. ఇదే సమయంలో ఇండియా - పాకిస్థాన్‌ల మధ్య కూడా యుద్ధం జరిగింది. అయితే, మిగతా యుద్ధాల్లో జరగని చర్చ ఇండియా - పాకిస్థాన్ యుద్ధం తర్వాత జరుగుతోంది. అదే ఆయుధాల వినియోగం. రష్యా ఉక్రెయిన్ కన్నా బలమైన దేశం. ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధత, ఆయుధ వ్యవస్థల విషయంలో పాలస్తీనా, ఇరాన్ కన్నా బలమైన దేశం. కానీ ఈ రెండు దేశాలు తమ ప్రత్యర్థులపై దాడులు చేసే క్రమంలో వారి బలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రష్యా రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నా, ఆ యుద్ధంలో విజయం సాధించలేకపోతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినప్పటికీ, ఇరాన్ వేసిన కొన్ని రాకెట్లను అడ్డుకోలేకపోయిందన్న వాదన వినపడింది. కానీ పాక్‌పై ఇండియా చేసిన యుద్ధంలో వాడిన సాంకేతికత, స్వదేశీ తయారు ఆయుధ పరికరాల వినియోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం విశేషంగా చెప్పాలి.

ఆపరేషన్ సింధూర్‌లో వాడిన దేశీయ తయారీ సాంకేతికత, ఆయుధ వ్యవస్థలు ఇవే

1. బ్రహ్మోస్ క్షిపణులు (BrahMos Missiles): ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మన దేశం పాకిస్థాన్‌పై తొలిసారిగా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు ఉంది. భారత్ - రష్యా సంయుక్తంగా ఈ మిస్సైల్‌ను డిజైన్ చేసినప్పటికీ, మన దేశ సాంకేతికత, డిజైన్, తయారీలో భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఈ క్షిపణికి మన దేశంలోని బ్రహ్మపుత్ర నది పేరును, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. ఈ మిస్సైల్ వేగం, కచ్చితంగా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడంలో కీలకంగా పనిచేశాయి.

2. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Akash Air Defence System): ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మన దేశీయంగా DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ. ఇది సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థ. ఇది మధ్య శ్రేణి క్షిపణులను, తక్కువ ఎత్తులో వచ్చే శత్రు డ్రోన్‌లను అడ్డుకునేందుకు వినియోగిస్తారు. దీని తయారీలో డీఆర్‌డీవోతో పాటు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి ఉత్పత్తి చేశాయి. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దీని వేగం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే శబ్దం కంటే 2.5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే క్షిపణి వ్యవస్థగా చెప్పవచ్చు. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఇది డ్రోన్‌లు, యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, వాటితో పాటు క్రూయిజ్ క్షిపణులను కూడా అడ్డుకోగలదు. అంతేకాదు, ఒకేసారి బహుళ లక్ష్యాలను (Multi-Target Capability) ఛేదించగలిగే సామర్థ్యం ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు ఉంది. ఇందులో ఏర్పాటు చేసిన రాజేంద్ర అనే రాడార్ వ్యవస్థ మల్టీపుల్-ఫంక్షన్ ఫేజ్డ్-అరే రాడార్ను వినియోగిస్తుంది. ఈ రాడార్ వల్ల ఒకేసారి అనేక టార్గెట్‌లను ఇది ట్రాక్ చేయగలదు. అప్పటికప్పుడు ఆ లక్ష్యాలను ఛేదించేందుకు ఆకాష్ క్షిపణులకు డైరెక్షన్ ఇవ్వగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా పాకిస్థాన్ మన సరిహద్దుల నుండి ప్రయోగించిన డ్రోన్‌లను గుర్తించి, వాటిని జామ్ చేసి, ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. సైనిక స్థావరాలతో పాటు డ్రోన్ దాడుల నుండి ప్రజలను, వారి ఆస్తులను కాపాడటంలో విశేషంగా పనిచేశాయని చెప్పాలి.

3. D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ (D4 Anti-Drone Systems): ఈ వ్యవస్థను DRDO అభివృద్ధి చేసింది. సరిహద్దులను దాటి వచ్చే డ్రోన్‌లను గుర్తించడం, వాటిని జామ్ చేసి ధ్వంసం చేయడం ఈ D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ పని. మన దేశంలోని కీలక సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలు, నగరాలు, పట్టణాలను శత్రు డ్రోన్‌ల నుండి కాపాడే రక్షణ వ్యవస్థగా దీన్ని రూపొందించారు. తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ ఉన్న చిన్నపాటి డ్రోన్‌లను కూడా గుర్తిస్తుంది. డ్రోన్‌ల కమాండ్ అండ్ కంట్రోల్ (C2) సిగ్నల్‌లను, అలాగే GPS/GNSS సిగ్నల్‌లను గుర్తించి, ట్రాక్ చేస్తుంది. పగలు, రాత్రి తేడా లేకుండా డ్రోన్‌లను గుర్తించి నిర్ధారించడానికి, ట్రాక్ చేయడానికి ఇందులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ (EO/IR) సెన్సార్లు ఉపయోగపడతాయి. ఇక ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలను వాడి, ఏ లక్ష్యాన్ని గుర్తించిందో ఆ టార్గెట్ ఉద్దేశాన్ని, ముప్పు ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉందని అంచనా వేసి, తదనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉంది.

4. ఆకాష్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Akashteer Air Defence System): ఇది కృత్రిమ మేధస్సుతో కూడిన గగనతల నియంత్రణ, నివేదన (Air Defence Control & Reporting System - ADCRS) వ్యవస్థగా చెప్పవచ్చు. ఏఐ ఆధారిత వ్యవస్థ. దీన్ని డీఆర్‌డీవో, ఇస్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యవస్థే ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇది కేవలం ఒక క్షిపణి వ్యవస్థగా చెప్పలేం. ఇది వైమానిక స్థావరాలు, రక్షణ సంస్థల ఆస్తులను శత్రువుల దాడుల నుంచి  కాపాడుతుంది. శత్రువుల దాడులను ట్రాక్ చేయడం, వాటికి ప్రతిస్పందించడంలో సహాయం చేసే పాత్ర ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత. వివిధ రక్షణ వ్యవస్థల నుంచి  అంటే రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్స్ నుండి వచ్చే సమాచారం సేకరించి, వాటిని పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని ప్రాసెస్ చేసి అందిస్తుంది. ఇందులో ఉపయోగించే ఏఐ టెక్నాలజీ ద్వారా డ్రోన్‌లు, క్షిపణులు, విమానాలను ట్రాక్ చేసి గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు తక్షణ నిర్ణయాలను తీసుకుంటుంది. సాధారణ ఎయిర్ డిఫెన్స్‌లతో పోల్చితే ఆకాష్ తీర్ చాలా వేగంగా లక్ష్యాలను గుర్తించి, వేగంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. మానవ ప్రమేయం లేకుండానే శత్రు టార్గెట్‌లను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థలకు ఆదేశాలు ఇవ్వగల సామర్థ్యం ఈ వ్యవస్థ ప్రత్యేకత. డ్రోన్ స్వార్మ్ అంటే ఒకే లక్ష్యాన్ని ఛేదించేందుకు ఎక్కువ సంఖ్యలో వచ్చే డ్రోన్‌లను అడ్డుకుని నియంత్రించగల సామర్థ్యం ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు ఉంది.

5. పిస్టన్ డ్రోన్‌లు (Piston Drones): పిస్టన్ డ్రోన్ అనేది పిస్టన్ ఇంజిన్‌తో నడిచే డ్రోన్. డ్రోన్‌లు సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా నడిచేలా తయారవుతాయి. ఇందుకు బ్యాటరీలను వినియోగిస్తారు. అయితే, పిస్టన్ డ్రోన్‌లు బ్యాటరీలతో వాడే ఎలక్ట్రిక్ మోటార్లతో కాకుండా పెట్రోల్ లేదా ఇతర ద్రవ ఇంధనాలతో పని చేసే పిస్టన్ ఇంజిన్‌ను వినియోగిస్తారు. పిస్టన్ ఇంజిన్‌లు ఎలక్ట్రిక్ బ్యాటరీల కంటే ఎక్కువ శక్తినిస్తాయి. ఎక్కువ సమయం పిస్టన్ డ్రోన్‌లు గాలిలో ఎగురగలవు. దీని ద్వారా సుదూర ప్రాంతాల్లో నిఘా పెట్టడానికి, మ్యాపింగ్ చేయడానికి వినియోగిస్తారు. సుదీర్ఘంగా నిర్వహించే మిషన్లకు ఇది చాలా ఉపయోగం. ఎక్కువ శక్తిని పిస్టన్ ఇంజిన్‌లు విడుదల చేయడం వల్ల ఈ డ్రోన్‌లు బరువు ఎక్కువ ఉండే పేలోడ్‌లు, కెమెరాలు, సెన్సర్‌లను తీసుకుని ప్రయాణించగల సామర్థ్యం ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఛార్జ్ టైం ఎక్కువ పడుతుంది. కానీ ఇంధనం నింపడం చాలా తేలిక, తక్కువ సమయంలోనే ఇవి పని చేసేందుకు రెడీగా ఉంటాయి. పిస్టన్ ఇంజిన్‌లు కఠినమైన వాతావరణంలోనూ, అధిక ఎత్తులో పని చేయగలవు. కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. పిస్టన్ ఇంజిన్‌లు ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. సైలెంట్ ఆపరేషన్లలో వీటిని ఉపయోగించడం ప్రమాదకరం. వీటి నిర్వహణ ఎలక్ట్రిక్ డ్రోన్‌లతో పోల్చితే కొంత కష్టమైన పని. ధర కూడా ఎక్కువ. అయితే, వీటిని ఆపరేషన్ సింధూర్‌లో వాడి ఉంటారని నిపుణులు చెబుతున్నప్పటికీ, నిర్దుష్టమైన ఆధారాలు మాత్రం లేవు. అయితే, ఈ దేశీయ తయారీ పిస్టన్ డ్రోన్ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

ఇలా ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారైన యుద్ధ సాంకేతికత, పరికరాలు సర్వత్రా చర్చకు దారి తీయడమే కాకుండా, ఆయా దేశాల మిలటరీ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలిచే భారత్ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. దేశీయ ఆయుధ వ్యవస్థలను అవి దిగుమతి చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఈ దిశగా మన రక్షణ రంగ వ్యవస్థలతోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు సాగుతున్నాయని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రక్షణ ఉత్పత్తుల్లో అమెరికా, యూరప్ దేశాలకు గట్టి పోటీనిచ్చే దిశగా ఇండియా సాగుతోందన్నది మాత్రం వాస్తవం.