Ind Vs Eng Manchestar Test Updates: ఇంగ్లాండ్ తో మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు మార్పులు చేశాయి. ముఖ్యంగా ఇండియా గాయపడిన తెలుగు కుర్రాడు, పేస్ ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో మరో ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడనున్నాడు. 24 ఏళ్ల కుర్ర పేసర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ స్థానంలో లెఫ్టాండర్ సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ లో ఒక మార్పు చేసింది. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ను జట్టులోకి తీసుకుంది. ఇక ఈ వేదిక స్వింగ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో అటు బ్యాట్ కు ఇటు బంతికి సమతూకం ఉండనుందని తెలుస్తోంది. ఈ వేదికపై ఇండియా ఎప్పుడూ గెలవకపోవడంతో.. ఈసారి లెక్క సరి చేయాలని భావిస్తోంది.
అనూహ్య మార్పులు..ఇక గెలుపే టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులతో భారత్ ఆశ్చర్యపర్చింది. ముఖ్యంగా వెటరన్ కరుణ్ స్థానంలో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంది. అనుభవం కంటే కూడా ఫామ్ నే దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన కరుణ్.. కంబ్యాక్ లో అంతగా ఆకట్టుకోలేదు. ఆరు ఇన్నింగ్స్ లలో కలిపి 131 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు శార్దూల్ ను తీసుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. నితీశ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ కాగా, శార్దూల్ బౌలింగ్ ఆల్ రౌండర్. తొలి టెస్టులో తను విఫలం కాగా, ఈ మ్యాచ్ లో ఆకట్టుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
నాలుగోసారి టాస్ ఓడిన గిల్..ఇక కెప్టెన్ గా ఈ సిరీస్ లోనే బాధ్యతలు తీసుకున్న శుభమాన్ గిల్.. ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలవలేదు. వరుసగా నాలుగోసారి కూడా టాస్ ఓడిపోయాడు. మరోవైపు టాస్ గెలిచిన స్టోక్స్ .. మరింత ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ తీసుకున్నాడు. ఈ వేదికపై ఫస్ట్ బౌలింగ్ చేసిన రికార్డు లేకపోయినప్పటికీ, తమ జట్టుపై ఉన్న విశ్వాసంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తొలి రోజు క్లౌడ్ కవర్ ఉండటంతోపాటు పిచ్ కాస్త బౌలర్లకు సహకరిస్తుండటంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా అనుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు. చివరిసారి ఈ వేదికలో దిగ్గజం అనిల్ కుంబ్లే అరంగేట్రం చేయగా.. ఇప్పుడే అదే ఇన్షియల్ (ఏకే) గల కాంబోజ్ కూడా డెబ్యూ చేయడం విశేషం. మరో వైపు అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లను కుంబ్లే తీయగా, డొమెస్టిక్ లో కాంబోజ్ ఒక ఇన్నింగ్స్ లో పదికి పది వికెట్లు తీయడం విశేషం. తను కూడా కుంబ్లేలాగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.