Amit Shah Karnataka Visit: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు తప్పదా? అవును కేంద్ర హోంమంత్రి కర్ణాటకలో పర్యటిస్తోన్న వేళ సీఎం మార్పుపై వరుస కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?







అమిత్ షా పర్యటన


భాజపా కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన వేళ అమిత్ షా రాష్ట్ర నేతలతో చర్చించి సీఎం మార్పుపై నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం బసవరాజు బొమ్మైతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమనే కోణంలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.


మొన్నే మార్పు


కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం భాజపా ప్రభుత్వం ఏర్పడింది. సీనియర్ లీడర్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కొద్ది కాలానికే ఆరోగ్య కారణాలు చూపించి యడియూరప్పను అధిష్ఠానం సీఎం పదవి నుంచి తప్పించి బసవరాజు బొమ్మైని కూర్చోబెట్టింది.


బొమ్మై ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది రోజులకే పదవి కోల్పోతున్నారంటూ ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఈ విషయమై బొమ్మై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పు గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఏదీ శాశ్వతం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. 


ఏదైనా చేస్తాం


భాజపా సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ప్ర‌ధాన కార్య‌దర్శి బీఎల్ సంతోశ్ దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కింది నుంచి పైస్థాయి వ‌ర‌కు తాము మార్పులు చేయాల‌నుకుంటే చేసేస్తామ‌ని, అందులో ఏమాత్రం సంకోచించ‌మ‌ని గుజ‌రాత్‌, దిల్లీ స్థానిక ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. ఇలా ఒక్క‌సారిగా మార్పులు చేయ‌డం భాజపాలో సాధ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం బీఎల్ సంతోశ్ వ్యాఖ్య‌లు వైరల్ అయ్యాయి. 


ఇందులో విఫలం


పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంలో బొమ్మై విఫలమయ్యారని అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు హోంమంత్రి కేఈ ఈశ్వరప్పపై వచ్చిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ కేసు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా హిజాబ్ వివాదం సమయంలో భద్రతను కాపాడటంలోను బొమ్మై విఫలమైనట్లు తెలుస్తోంది.


Also Read: Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!


Also Read: Nand Mulchandani: అమెరికాలో మనోడికి అరుదైన గౌరవం- నిఘా సంస్థ సీటీఓగా నియామకం