Nand Mulchandani: అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)లో తొలి ముఖ్య సాంకేతిక అధికారి- సీటీఓగా నంద్ మూల్‌చందనీ నియమితులయ్యారు.
ముఖ్య సాంకేతిక అధికారిగా తనను నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు మూల్‌చందనీ పేర్కొన్నారు. సీఐఏలోని సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
తొలిసారి
భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లకుపైగా మూల్‌చందనీ పని చేశారు. ప్రస్తుతం ఆయన రక్షణ శాఖలో సేవలందిస్తున్నారు. మూల్‌చందనీని సీటీఓగా నియమిస్తున్నట్లు సీఐఏ డైరెక్టర్ డాక్టర్ విలియమ్ జే బర్న్స్ ధ్రువీకరించారు.
సీఐఏను మరింత పటిష్ఠం చేసేందుకు సీటీఓ నియామకం కీలకమని జే బర్న్స్ అన్నారు. అందుకు మూల్‌చందనీ సరైన వారని పేర్కొన్నారు.
దిల్లీ నుంచి
- దిల్లీలోని బ్లూబెల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1979 నుంచి 1987 వరకు మూల్‌చందనీ చదివారు.
- ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్, హర్వర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులయ్యారు.
అంతా మనోళ్లే
బైడెన్ యంత్రాంగంలో 20 మంది భారత సంతతి అమెరికన్లు ఉన్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు.
Also Read: Corona Virus Cases: దేశంలో 5వ రోజూ 3వేల కరోనా కేసులు- 26 మంది మృతి