Spicejet Airlines: లో-బడ్జెట్ విమాన ప్రయాణాలకు కేరాఫ్‌గా నిలిచిన స్పైస్‌జెట్ విమానయాన సంస్థ కొత్త చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు చెందిన రెండు విమానాలు మంగళవారం సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒకదానికి కాక్‌పిట్ విండ్ షీల్డ్ క్రేక్ కావడం వల్ల ముంబయిలో ల్యాండ్ చేయగా, మరొక విమానం.. సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
గత 17 రోజుల్లో 7 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు చేసింది స్పైస్‌జెట్ సంస్థ. ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేపడుతోంది.
7 ఘటనలు ఇలా
జులై 5
స్పైస్‌జెట్ విమానం ఒకటి అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరిన విమానం ఫ్యూయల్ ఇండికేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.
జులై 5
మరో స్పైస్‌జెట్ విమానంలోని ఔటర్ విండ్ షీల్డ్ కాక్‌పిట్ క్రాక్ అవడంతో ముంబయిలో మంగళవారం ల్యాండ్ చేశారు.
జులై 2
జులై 2న జబల్‌పుర్-దిల్లీ విమానం క్యాబిన్‌లో పొగలు వచ్చాయి. దీంతో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
జూన్ 25, 24
గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
జూన్ 19
పట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్‌పూర్-దిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది.
Also Read: UK Ministers Resign: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌కు షాక్- ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా!
Also Read: Covid Update: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- మహారాష్ట్రలో వైరస్ విజృంభణ