వాళ్లంతా నమ్మక ద్రోహులే..
శివసేనను కాదని బయటకు వెళ్లినప్పటి నుంచి ఏక్‌నాథ్ షిందేపై మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. షిందే సీఎం పదవి చేపట్టాక కూడా ఈ దాడిని ఆపటం లేదు. ఇటీవల అసెంబ్లీలో షిందే చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు ఠాక్రే. తమది సామాన్యుల ప్రభుత్వమని చెప్పిన ఆయన...తమ ఆటో వేగానికి (షిందే ఒకప్పుడు ఆటో డ్రైవర్‌గా పని చేశారు) మెర్సిడెస్ బెంజ్ వెనకబడి పోయిందని ఠాక్రేను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఠాక్రేను కాస్త ఇబ్బంది పెట్టాయి. అందుకే వెంటనే కౌంటర్ అటాక్ చేశారాయన. "మితిమీరిన వేగంతో వెళ్లటం వల్లే ఆటో బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి" అని అన్నారు ఠాక్రే. శివసేన మహిళా విభాగం నిర్వహించిన సమావేశంలో రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఘాటైన విమర్శలు చేశారు. వారంతా "నమ్మక ద్రోహులు" అంటూ మండిపడ్డారు. అదే సమయంలో షిందేపైనా విమర్శలు చేశారు.
మెర్సిడెస్ బెంజ్ వెనకబడిపోయింది..
"అసెంబ్లీలో షిందే ప్రసంగం వింటే, ఇదంతా కుట్ర అని స్పష్టంగా అర్థమవుతోంది. డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆపమని వారిస్తున్నా షిందే ఆగలేదు. ఆటో బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి కదా. ఎలా ఆగుతాడు. గతంలో భాజపా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని "త్రీవీలర్ గవర్నమెంట్" అంటూ వెక్కిరించేది. ఇప్పుడు ఆ త్రీవీలర్‌ను నడిపిన వ్యక్తే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు" అంటూ ఉద్దవ్ ఠాక్రే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఠాక్రే వ్యాఖ్యలపై సీఎం షిందే స్పందించారు. "ఆటో స్పీడ్ పెరగలేదు. మెర్సిడెస్ బెంజే వెనకబడిపోయింది. ఇది సామాన్యుల ప్రభుత్వం" అని ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. "శివసేనలో ఎవరికైతే ప్రాధాన్యతనిచ్చి పగ్గాలు అప్పగించామో, వాళ్లే వెన్నుపోటు పొడిచారు. ఇంత కన్నా దారుణం ఇంకేముంటుంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు. ఎన్‌సీపీని, కాంగ్రెస్‌ను ఈ సందర్భంగా అభినందించారు కూడా. " ఈ కష్టకాలంలో మాకు అండగా నిలబడుతున్నారు" అంటూ పొగిడారు.
పక్కా ప్లాన్ ప్రకారమే..
శివసేన ఉనికిని తుడిచి పెట్టడానికే ఇలా ప్లాన్ చేశారని అన్నారు ఠాక్రే. "శివసేన నేతలు ఒకరితో ఒకరు ఘర్షణ పడేలా చేయటమే భాజపా ప్లాన్. ఇందుకోసం షిందేను ముందుకు నెట్టి వెనక నుంచి ఇదంతా నడిపించారు. భాజపా కంట్రోల్‌లోకి వెళ్లిపోయేవరకూ షిందేకి కూడా ఇది తెలిసుండదు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షిందే మాట్లాడుతుంటే ఫడణవీస్ మైక్ లాక్కున్నారు. భవిష్యత్‌లో ఇంకేం లాక్కుంటారో" అని అన్నారు. ఇలా రోజూ ఏదో విధంగా షిందే, ఠాక్రే మధ్య వార్ నడుస్తూనే ఉంది. ప్రజల్ని పట్టించుకోలేదని సీఎం షిందే ఆరోపిస్తుంటే, మోసం చేశారని ఠాక్రే విమర్శిస్తూ వస్తున్నారు.