శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవే మనం తినే ఆహారంలోని చెత్తని వడపోసి బయటికి పంపేస్తాయి. ఇవే కనుక సరిగా పనిచేయకపోయినా, పాడైపోయినా పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అందుకే ఏది పడితే అది తినకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపే కిడ్నీల కోసం కూడా ప్రత్యేకంగా మనం కొన్ని ఆహారాలు తినాల్సిందే. రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని తీసివేసే బాధ్యత కూడా కిడ్నీలదే. కాబట్టి కిడ్నీలు బావుండాలంటే కొన్ని రకాల ఆహరాలు తరచూ తినాలి. 


పైనాపిల్
ఇది సీజనల్ పండే, పోనీ అది దొరకే సీజన్లలోనైనా తింటున్నారా? తినే వాళ్లు చాలా తగ్గిపోయారు. చాలా పండ్లో పొటాషియం, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. పైనాపిల్ లో మాత్రం తక్కువ పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి చాలా మేలు చేస్తుంది. కిడ్నీ వ్యాధులు లేకపోయినా దీన్ని తినడం వల్ల మేలు జరుగుతుంది.  రోగినిరోధకశక్తిని పెంచడం, వాపు తగ్గించడం, జీవక్రియను మెరుగుపరచడం వంటివి చేస్తుంది. కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. దీనిలో నేచురల్ ఎంజైమ్ ఉంటుంది. దీన్ని బొమెలైన్ అని పిలుస్తారు. ఇది పెయిన్ కిల్లర్  లా పనిచేస్తుంది. ఇది కాకుండా పైనాపిల్ లో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం మొత్తానికి మేలు చేస్తుంది. 


ఎరుపు, పసుపు క్యాప్సికం
క్యాప్సికమ్‌లోనే రంగురంగుల కూరగాయలు ఇవి. తక్కువ పొటాషియాన్ని కలిగి ఉంటాయి. కిడ్నీ రోగులకు ఉత్తమ ఆహారమని చెప్పాలి. వీటిని బెల్ పెప్పర్స్ అంటారు. వీటిలో విటమిన్ సి ఉంటుంది. కిడ్నీలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఇందులో విటమిన్ ఎ కూడా లభిస్తుంది. ఇవి కూడా రోగినిరోధక శక్తిని పెంచుతాయి. 


స్ట్రాబెర్రీలు
సూపర్ మార్కెట్లలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి స్ట్రాబెర్రీలు. వీటినిండా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. కిడ్నీ రోగులకు ఇవి ఎంతో మంచివి. వీటిలో కూడా తక్కువ పొటాషియం ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడి, కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. 


పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో బి విటమిన్లు, రాగి, మాంగనీసు, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు కిడ్నీ రోగులకు చాలా మంచివి. వీటిని తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో కూడా పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది. 


క్యాబేజీ
ఫైటో కెమికల్స్‌తో నిండి ఉంటుంది క్యాబేజీ. రుచి పరంగా ఎక్కువమందికి నచ్చదు. కానీ ఇది కిడ్నీల విషయంలో సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. డైటరీ ఫైబర్స్, విటమిన్ కె, విటమిన్ సి, బి విటమిన్ క్యాబేజీలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో పొటాషియం, ఫాస్పరస్, సోడియం తక్కువగా ఉంటాయి. అందుకే క్యాబేజీ కిడ్నీ రోగులకు గొప్ప వరం. 


భవిష్యత్తులో ఎలాంటి కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే పైన చెప్పిన ఆహారాలను తరచూ తింటూ ఉండాలి. 



Also read: అచ్చు అలియా భట్‌లాగే ఉంది కదా, అదే ఆ పిల్లకు శాపమైంది, ఓ మోడల్ కథ


Also read: ఏసీలో ఎక్కువ సమయం ఉంటున్నారా? అయితే త్వరగా ముసలోళ్లయిపోతారు