గులాబ్ తుపాన్  ఆదివారం రాత్రి  శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిషాలోని గోపాల్‌పూర్‌ మధ్య తీరాన్ని దాటినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గులాబ్‌  ఉత్తరాంధ్రపై విరుచుకుపడింది.  మూడు జిల్లాల్లోను కుండపోత కురుస్తోంది.  శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య గులాబ్ ప్రభావం భారీగా ఉంది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి,  విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఉత్తరాంధ్ర పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతోందన్నారు కలెక్టర్‌ శ్రీకేష్‌ . శ్రీకాకుళం జిల్లాలో 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా కంట్రోల్‌ రూమ్‌కు తెలపాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 08942240557 జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 6309990933కు సమాచారం అందించాలన్నారు.  






ఉత్త్రరాంధ్ర పై గులాబ్ ఎఫెక్ట్...
గులాబ్‌ తుపాన్‌ కారణంగా  శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 80 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.  వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 58 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్‌ను తిరిగి పునరుద్ధరించే పనిలో ఉన్నారు అధికారులు. ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి. విశాఖలోనూ గులాబ్‌ ఎఫెక్ట్‌ భారీగానే ఉందికాన్వెంట్ జంక్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద నడుము లోతులో నీరు చేరింది.  యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్దరణ పనులు చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గులాబ్‌ తుఫాను ప్రభావం కారణంగా విద్యుత్‌ అంతరాయంపై టోల్‌ ఫ్రీ నెంబర్‌ 191కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోష్‌రావు సూచించారు. విద్యుత్‌ పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. గులాబ్ ప్రభావంతో ఆంధ్రలో మిగిలిన జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. 
  
హైదరాబాద్‌లో హై అలర్ట్‌..
గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం హైదరాబాద్‌పై కూడా పడింది. ఈ ప్రభావంతో సోమవారం  నుంచి బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ విభాగాధిపతులు, జోనల్‌ కమిషనర్లకు ఈవీడీఎం డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.


ఈ నెల 28న మరో అల్పపీడనం
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని తెలిపింది.


Also read: నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్.. భారత్ బంద్ వేళ కీలక నిర్ణయం


Also Read: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... భారీగా ఈదురుగాలులు


Also Read: రిలీజ్ డేట్ పై 'కేజీఎఫ్' టీమ్ మరోసారి క్లారిటీ.. పక్కకు తప్పుకున్న ఆమిర్ ఖాన్..


Also read: ఈ వారం ఈ మూడు రాశులవారు సక్సెస్ అవుతారు. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండండి ,మిగిలిన రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి