ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేపు(సోమవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించింది. భారత్‌ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాలు మద్దతిస్తున్నాయి. ఈ మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉత్తర్వులు జారీచేశారు. రేపు సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు పనిదినంగా ప్రకటించినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. 


Also Read: భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!


మధ్యాహ్నం వరకు బస్సులు బంద్


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 27న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నారు.  బంద్ రోజున ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. శాంతి యుతంగా బంద్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3  రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పేర్ని నాని కోరారు.


Also Read: రేపు భారత్ బంద్ కు రైతు సంఘాల పిలుపు... మద్దతిస్తున్న పార్టీలివే... వైసీపీ మద్దతుపై సోము వీర్రాజు ఆగ్రహం


పలు పరీక్షలు వాయిదా


భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భారత్ బంద్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపు నిర్వహించాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రకటించారు. భారత్ బంద్ వల్ల స్టడీ సర్కిల్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. భారత్ బంద్ నేపథ్యంలో రేపు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్  తెలిపారు. పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. 


Also Read: భారత్ బంద్.. తెలుగు రాష్ట్రాల్లో రేపు పలు పరీక్షలు వాయిదా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి