Cyclone Gulab Live Updates: తీరాన్ని తాకిన గులాబ్ తుపాను... భారీగా ఈదురుగాలులు

ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

ABP Desam Last Updated: 26 Sep 2021 08:51 PM
శ్రీకాకుళం జిల్లాలో 1358 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. 13 మండలాల్లో 61 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించామన్నారు. వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదలపాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో 500 మందికి పునరావాసం కల్పించామని పేర్కొన్నారు. 

గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల్లో నలుగురు క్షేమం... లభ్యం కాని ఇద్దరి ఆచూకీ 

ఆదివారం మధ్యాహ్నం అక్కుపల్లి సముద్ర ప్రాంత సరిహద్దుల్లో గల్లంతైన మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురు మత్స్యకారులు ఎలుకల పాపారావు, వంక చిరంజీవి, కొండ బీమారావు సురక్షితంగా అక్కుపల్లి సముద్ర తీరానికి చేరుకున్నామని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రస్తుతం ఆచూకీ తెలియని పిట్ట హేమారావు బోటులోనే ఉండే అవకాశం ఉంటుందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నేవీ అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుల్లో మృతిచెందడనుకున్న వంక నాయకన్న ప్రాణాలతో సముద్ర తీరం చేరుకున్నారు. మంత్రి అప్పలరాజు ఆదేశాల మేరకు ఇచ్చాపురం నుంచి భవనపాడు వరకు తీరప్రాంతాలలో మత్స్యకారులు గాలింపు చేపట్టారు. బోట్ ఫ్యాన్ కాలికి తగిలి వంకనాయకన్నకు గాయం అయింది.  ఆయన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 

తీరాన్ని తాకిన గులాబ్ తుపాను

 ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య గులాబ్ తుపాను తీరాన్ని తాకింది. కళింగపట్నానికి  25 కి.మీ. దూరంలో తుపాను తీరాన్ని తాకింది. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు 3 గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.  ఉత్తరాంధ్ర తీరం వెంబడి 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

తీరాన్ని తాకిన గులాబ్ తుపాను

గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు గంటల్లో తీరాన్ని తాకే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లండించింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి  25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 95 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

విజయనగరం జిల్లాపై గులాబ్ తుపాన్ ప్రభావం

విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నేటి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య 20.2 మీ.మీ సరాసరి వర్ష పాతం నమోదైంది. పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ, పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీ.ల సరాసరి వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వేపాడలో 7 మీ.మీ, రామభద్రపురంలో 5.6 మీ.మీ., కొత్తవలసలో 5.2 మీ.మీ. వర్షం కురిసింది. తుఫాన్ ఆదివారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆ సమయంలో 80 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ తెలిపింది. హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ల విడిచి బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు తెలిపారు. 
 


 

19 కి.మీ. వేగంతో కదులుతోన్న గులాబ్ తుపాను

గులాబ్ తుపాను 19 కి.మీ. వేగంతో కదులుతోందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గోపాల్‌పూర్‌కు110 కి.మీ, కళింగపట్నానికి 130 కి.మీ దూరంలో తుపాను ఉందని ప్రకటించింది. ఉత్తరాంధ్ర తీరం వెంట 75-95 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉభయగోదావరి, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండండి... అన్ని చర్యలు చేపట్టాం : మంత్రి సీదిరి అప్పలరాజు

గులాబ్ తుపాన్ పలాస, టెక్కలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. తుపాను ప్రభావంతో 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు.  

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశం

గులాబ్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు అర్థరాత్రి  గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రకటించింది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చెప్తోంది. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్

సీఎం జగన్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. గులాబ్ తుపాను ప్రభావంపై మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

శ్రీకాకుళంపై తుపాను ప్రభావం అధికం

 శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు ముందస్తు చేపడుతున్నారు. గులాబ్ తుపాను ఒడిశా, ఏపీపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లుగా వాతావరణశాఖ తెలిపింది. 

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపాను.. సముద్రంలో అలజడి

తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్​కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. సాయంత్రానికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.

గులాబ్ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

గులాబ్ తుపాను ఎఫెక్ట్ తో అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు.


26వ తేదీన రద్దైన రైళ్ల వివరాలు
07015- భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్,
02071- భువనేశ్వర్ నుంచి తిరుపతి,
02859-పూరి నుంచి చెన్నై సెంట్రల్
02085- సాంబల్‌పూర్ నుంచి హెచ్ నాందేడ్
07244- రాయఘడ నుంచి గుంటూరు
08463- భువనేశ్వర్ నుంచి కేఎస్సార్ బెంగళూరుసిటీ
02845- భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్


27వ తేదీన రద్దైన రైళ్ల వివరాలు
02072- తిరుపతి నుంచి భువనేశ్వర్
02860-చెన్నై సెంట్రల్ నుంచి పూరి
02086- హెచ్‌ఎస్ నాందేడ్ నుంచి సాంబల్‌పూర్
08464- కేఎస్సార్ బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్
02846- యశ్వంత్‌పూర్ నుంచి భువనేశ్వర్

ఆరెంజ్ హెచ్చరికలు జారీ


ఒడిశా, ఉత్తరాంధ్రపై గులాబ్ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. పూరీ, భువనేశ్వర్,  మీదుగా వెళ్లే 24 రైళ్లు రద్దు అయ్యాయి. ఒడిశా గోపాల్ పూర్ కు 290 కీ.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు రాత్రికి  కళింగపట్నం, గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  గంటకు 70-90 కీ మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. సహయక చర్యల కోసం 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న గులాబ్ తుపాను

ఒడిశాలోని గోపాల్ పూర్ కు ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్లు , శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తూర్పు దిశగా 440 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమైంది. తుపాన్ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ కారణంగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Background

బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండగా మారిన సంగతి తెలిసిందే. అది మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుపాన్‌గా మారింది. దీనికి గులాబ్‌గా నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కి.మీ, శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నానికి 380 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలకు గులాబ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.