Amarinder Singh To Join BJP: పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని భాజపాలో విలీనం చేయనున్నారు. దీంతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు.




ఫ్యామిలీతో


కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్ కూడా భాజపాలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అమరీందర్ ఇటీవల వెన్నెముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్నారు.


అమరీందర్ సింగ్ రెండు సార్లు పంజాబ్ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత సొంతంగా పీఎల్‌సీ పార్టీని ఏర్పాటు చేసి భాజపా, సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్‌తో పొత్తు పెట్టుకుని 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అమరీందర్ సహా పీఎల్‌సీ అభ్యర్థులంతా ఓడిపోయారు.


కాంగ్రెస్‌ను వీడి


కాంగ్రెస్ పార్టీలో అప్పటి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానం జరగడాన్ని సహించలేక కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో సిద్ధూపై అమరీందర్ తీవ్ర ఆరోపణలు చేశారు.



నవజోత్ సింగ్ సిద్ధూ.. ఓ అసమర్థుడు. ఆయనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఆయన జాతీయ భద్రతకే ముప్పు.                       "
-  అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం



నన్ను అవమానించారు


" ఇటీవలి కాలంలో నేను ప్రభుత్వాన్ని నడపలేనని వారికి అనుమానం ఉన్నట్టుంది. వాళ్లు నన్ను అవమానించారు. చర్చలు జరిపిన తీరు చూస్తే అది అర్థమవుతుంది. పార్టీని కష్టపడి అధికారంలోకి తెచ్చినప్పటికీ అధిష్ఠానం నా వైపు నిలబడలేదు."