AP Assembly Session : ఏపీ శాససభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో సమావేశాల్లో ఎనిమిది బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసనసభ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై సభలో స్వల్ప చర్చ కొనసాగుతోంది.
పారిశ్రామిక అభివృద్ధిపై స్వల్ప చర్చ
ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి అంశంపై స్వల్ప చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోలేదన్నారు. పరిశ్రమల స్థాపన కేవలం కాగితాలకే పరిమితం అయిందన్నారు. చంద్రబాబు వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వంపై మోపుతున్నారన్నారు. చంద్రబాబు అప్పులు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం లక్ష కోట్ల భారం మోపిందన్నారు. గ్రాఫిక్స్‌తో రాజధాని రైతులను మోసం చేశారని ఆరోపించారు. అప్పటి అప్పులను సీఎం జగన్ పెద్ద మనసుతో తీర్చారన్నారు. రాష్ట్రానికి లక్షా 57 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సభలో తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రోత్సహాన్ని అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల బకాయిలు కూడా చెల్లించామన్నారు. ఏపీ అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులపై చర్చ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలిస్థానంలో ఉందని స్పష్టం చేశారు.
టీడీపీ సభ్యులు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజు కూడా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. రెండో రోజు సభ ప్రారంభం కాగానే పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. తర్వాత టీడీపీ సభ్యులపై ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకపోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ ది మార్షల్స్ అండ్ పుల్ దెమ్ అవుట్ అని ఇంగ్లిష్‌లో ఆవేశంగా స్పందించారు.
Also Read : Merugu Nagarjuna Comments : రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !
Also Read : AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !