3 Capitals For Andhdra Pradesh: తిరుపతి : పేదరిక నిర్మూలన అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం అవుతుందని, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించుకోవడం జరిగిందని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారి వస్త్రం, స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పొందారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 


అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కోసమే.. 
అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఒకే చోట ఉండకుండా, రాష్ట్ర నలువైపులా వ్యాప్తి చెందాలనే పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని తెలిపారు. ఏదోక ప్రాంతంలో కొంతమంది అభివృద్ధి కోసం రాజధాని ఏర్పాటు చేయడం కాకుండా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, అమరావతి రాజధానిగా, కర్నూలు న్యాయరాజధానిగా చేయాలని తెలియజేయడమే కాకుండా ధృడ సంకల్పంతో సీఎం పని చేస్తున్నారన్నారు. 


పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు
రాబోయే ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కూడా చేర్చబోతున్నారని, అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు చదువులను ప్రోత్సహిస్తున్నారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేశారని, కొందరు పని గట్టుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులపై విమర్శలు చేసారని, ఇది సరైన విధానం కాదని, పేదలు ఇంగ్లీషు మీడియం చదువులోకూడదని, పేదవారు పేదవారిగానే మిగిలి పోవాలని కొందరు కుట్ర పొందుతున్నారని ఆయన చెప్పారు.. 2024లో మరో సారి ప్రజలంతా అఖండ విజయంను వైసీపి అందించబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల ప్రకటన చేయడం జరిగిందని, మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టబోతున్నారని, ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఎవరూ‌ కూడా మూడు రాజధానులను ఆపలేరని ఎంపీ సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.


శ్రీవారి సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పి.వి.సింధు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల పివి.సింధు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత స్వామి వారి దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. తన కాలికి గాయం కావడంతో ప్రస్తుతం తాను విశ్రాంతిలో ఉన్నానని, రాబోయే సంవత్సరం నుండి టోర్నమెంట్స్ ఉన్నాయని, అందులో బాగా ఆడాలని స్వామి వారిని కోరుకున్నట్లు పివి.సింధు తెలిపారు.