ABP  WhatsApp

SCO Summit 2022: భారత్‌లో 100కు పైగా యూనికార్న్‌లు, 70 వేల స్టార్టప్‌లు: మోదీ

ABP Desam Updated at: 16 Sep 2022 05:11 PM (IST)
Edited By: Murali Krishna

SCO Summit 2022: షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

(Image Source: Twitter/@narendramodi)

NEXT PREV

SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లోని సమర్​ఖండ్​ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసంగించారు. ప్రపంచంలో షాంఘై సహకార సంఘం పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని మోదీ అన్నారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. 







ప్రస్తుతం ప్రపంచం కొవిడ్-19 మహమ్మారిని అధిగమిస్తోంది. ఈ సమయంలో ఎస్‌సీఓ పాత్ర చాలా ముఖ్యం. ఎస్‌సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం నివసిస్తోంది. ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 30 శాతం వాటా ఈ దేశాలదే. ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని భారత్ సమర్థిస్తుంది. ఈ దేశాల మధ్య సహకారం మరింత పెరగాలి. కొవిడ్-19, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రపంచం మునుపెన్నడూ లేని స్థాయిలో ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటోంది. మేం భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాలనుకుంటున్నాం. ఇందుకోసమే ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నాం. అలానే సహకరిస్తున్నాం. నేటికి భారత్‌లో 100కుపైగా యూనికార్న్‌లు, 70 వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి.                                                           -     ప్రధాని నరేంద్ర మోదీ


ఫేస్‌ టూ ఫేస్


తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు వచ్చే ఏడాది షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్​ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. తాము సదస్సు విషయంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు.


ద్వైపాక్షిక చర్చలు


SCO శిఖరాగ్ర సదస్సులో భాగంగా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.


Also Read: Viral Video: మాజీ సీఎంను కొండెక్కించిన ఏనుగు- ప్రాణ భయంతో పరుగో పరుగు!


Also Read: Bharat Jodo Yatra: వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి- జోడో యాత్రకు డబ్బులు ఇవ్వలేదని!

Published at: 16 Sep 2022 05:01 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.