ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్‌లో ఆమె హస్తం ఉందని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆమె ప్రమేయం కీలకమని.. కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈయన పలువురు రాజకీయ నాయకులకు అకౌంటెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సన్నిహితులుగా పేరు పడిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి వంటి వారి ఇళ్లలో రెండు సార్లు సోదాలు నిర్వహించింది.
దేశవ్యాప్తంగా విస్తృతంగా ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సహా 43 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు నెల్లూరులోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుపుతోంది. ఢిల్లీ లోథీ రోడ్ లోని 95 నెం. బంగ్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ చౌరస్థాలోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సోదాలు జరుగుతున్నాయి. రాయదుర్గంలోని జయభేరి సౌత్ బ్లాక్ లో అభినయ్ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అటు తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ ను ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు వెళ్లారు.
హైదరాబాద్‌పై స్పెషల్‌గా ఫోకస్ పెట్టిన ఈడీ !
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ... ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్ింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు ఆడిటర్ అయిన గోరంట్ల అండ్ అసోసియేట్స్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగడం చర్చనీయాంశమవుతోంది.
తనపై ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్న కవిత
కల్వకుంట్ల కవిత ఇప్పటికే బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఢిల్లీలో సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత పేరు లేదు. కానీ ఆమె పై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేశారు. ఈ కారణంగా ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసులో సంబంధం ఉందని.. విచారణ కోసం ఈడీ నోటీసులు జారీ చేసిందని ప్రచారం కావడం దుమారం రేపుతోంది. కానీ ఆమెకు గానీ, ఆమె ఇంట్లో వ్యక్తులకు ఈడీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని సమాచారం.