Bihar Viral News:
15 కిలోమీటర్లు రైలుకు వేలాడుతూ..
రైళ్లలో దొంగతనాలు కొత్తేం కాదు. జేబుకి తెలియకుండా పర్సులు దొంగిలించటంలో కొందరు ఆరిపోయిన వాళ్లుంటారు. తరచు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా...పెద్దగా ప్రయోజనం ఉండదు. రైళ్లలో ప్రయాణికులకు రక్షణ లేదంటూ ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోతోంది. ఫలితంగా...ఎంతో మంది ప్రయాణికులు విలువైన వస్తువులు పోగొట్టుకోవాల్సి వస్తోంది. అయితే అందరు ప్యాసింజర్స్ ఒకేలా ఉండరు కదా. దొంగల కంటే ఓ ఆకు ఎక్కువగానే చదివిన వాళ్లు...చోరీని ఇట్టే పసిగట్టేస్తారు. బిహార్‌లోని ఖగారియాలో ఇదే జరిగింది. కదులుతున్న రైలు కిటికీ నుంచి చేయి పెట్టి మొబైల్‌ను దొంగిలిద్దామని చూసిన దొంగకు చుక్కలు చూపించారు ప్రయాణికులు. మొబైల్ కొట్టేద్దామని అలా కిటికీలో నుంచి చేయి పెట్టాడో లేదో వెంటనే ప్యాసింజర్ ఆ దొంగ చేయిని గట్టిగా పట్టేసుకున్నాడు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు మరో చేయిని గట్టిగా పట్టుకుని లోపలకు లాక్కున్నాడు. ఇంతలోనే రైలు ముందుకు కదిలింది. దాదాపు 15 కిలోమీటర్ల వరకూ దొంగ ఇలా కిటికీకి వేలాడుతూనే ఉన్నాడు. దొంగ కిటికీని పట్టుకుని వేలాడుతుండటాన్ని ఆ ఇద్దరు ప్రయాణికులు వీడియో కూడా తీశారు. సాహెబ్‌పుర్ రైల్వే స్టేషన్ నుంచి ఖగారియా స్టేషన్ వరకూ ఇలా వేలాడుతూనే ఉన్నాడు ఆ దొంగ. చేతులు విరిగిపోతాయని, వదిలితే చనిపోతానని దయచేసి చేతులు వదలకూడదని ఆ ప్రయాణికులను వేడుకున్నాడు దొంగ. తరవాత ఖగారియాలోని రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు...దొంగను జైలుకు పంపారు.