Yamuna River Water Level:
క్రమంగా తగ్గుతున్న ఉద్ధృతి
దిల్లీలోని యమునా నది ప్రవాహ ఉద్ధృతి కాస్త తగ్గింది. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ లెక్కల ప్రకారం..శనివారం 8 గంటల సమయానికి నీటిమట్టం 205.88మీటర్లుగా ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి నీటిమట్టం 204.83మీటర్లకు తగ్గుముఖం పట్టింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రమాదకర స్థాయిలో ప్రవహించిన యమునా నది ఇప్పుడిప్పుడే కాస్త శాంతిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. ఈ నెల 12వ తేదీన నీటిమట్టం 205.33 మీటర్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఆ రోజు భారీ వర్షపాతం నమోదైంది. ముంపు ప్రాంతంలోని 7వేల మంది పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి క్రమక్రమంగా ప్రవాహ ఉద్ధృతి తగ్గుతూ వచ్చింది. ఈ నీటిమట్టం ఇంకా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లోని పౌరుల్లో 5 వేల మందిని హాథీ ఘాట్‌లో టెంట్లలోకి తరలించారు. మరి కొందరిని నార్త్‌ఈస్ట్ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు పంపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు వసతులు ఏర్పాటు చేస్తున్నాయి. ఆహారం, తాగునీరు సహా ఇతరత్రా నిత్యావసరాలు అందిస్తున్నాయి. కరవాల్ నగర్‌లో 200 మంది ఎత్తైన ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. హరియాణాలో యమునా నగర్‌లోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీరు విడుదలవటం వల్ల దిల్లీకి ఇబ్బందులు తప్పలేదు. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్కుల మార్క్‌నూ దాటింది. వెంటనే అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేశారు. దాదాపు 37 వేల మందిపై ఈ వరదల ప్రభావం పడింది. కొందరికి స్కూల్స్‌లోనే శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొందరికి బిల్డింగ్‌లలో వసతులు కల్పిస్తున్నారు
.
భారీ వర్షాల కారణంగానే..
సాధారణంగా...హత్నికుండ్ బ్యారేజ్ ఫ్లో రేట్ 352 క్యూసెక్కులు మాత్రమే. కానీ..భారీ వర్షాల కారణంగా డిశ్చార్జ్ అనూహ్యంగా పెరిగింది. బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు దిల్లీకి చేరుకోటానికి రెండు,మూడు రోజుల సమయం పడుతుంది. కానీ...వర్షాల ధాటికి ముందుగానే దిల్లీని ముంచెత్తాయి. ఒక క్యూసెక్ అంటే సెకనుకు 28.32 లీటర్లు. శనివారం అర్ధరాత్రికి డిశ్చార్చ్ రేట్ 1.49 లక్షల క్యూసెక్కులు కాగా...అంతకు ముందు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఈ రేటు 2.21లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అంటే ఏ స్థాయిలో నీటిమట్టం పెరుగుతుందో ఊహించవచ్చు. గతేడాది కూడా యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. గతేడాది జులై 30వ తేదీన ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నది నీటిమట్టం 205.59 మీటర్లకు చేరుకుంది.
Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?
Also Read: Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?