తెలుగు వారికి పచ్చళ్లు, పొడులు చాలా నచ్చుతాయి. అరిటాకులో అన్నం, పప్పు, పచ్చడి, పొడి, కూర, పెరుగు, అప్పడం అన్నీ కలిస్తేనే తెలుగింటి భోజనం. పుదీనా పొడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా మంది రెడీమేడ్‌గా కొని తెచ్చుకుంటారు. అలా కొని తెచ్చుకునే బదులు ఇంట్లో మీరే టేస్టీగా చేసుకోవచ్చు. చేయడం కూడా పెద్ద కష్టం కాదు, చాలా సులువు. ఓసారి చేసుకున్నారంటే అలవాటైపోతుంది. వేడి వేడి అన్నంలో పుదీనా పొడి వేసుకుని పైన నెయ్యి వేసి తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి తింటే మీరే వదలరు.  


కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు - ఒక కప్పు
ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
మినప్పప్పు - పావు కప్పు
శెనగ పప్పు - అరకప్పు
ఎండు మిర్చి - పది
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - చిన్న ఉండ
నూనె - మూడు స్పూనులు


తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి పుదీనా ఆకులను వేయించాలి. దీసి పక్కన పెట్టుకోవాలి. 
2. అదే కళాయిలో మినప్పప్పు, శెనగపప్పు కూడా వేయించి తీసి పక్కన పెట్టాలి. 
3. ఆ తరువాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించాలి. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. 
4. ఇప్పుడు స్పూను నూనె వేసి ఎండు మిర్చి వేయించాలి. 
5. మిక్సీ జార్లో అన్నీ కలిపి వేయాలి. చింత పండు కూడా వేసి పొడి కొట్టాలి. 
6. దీన్ని గాలి చొరబడని డబ్బాల్లో వేసి ఉంచుకుంటే ఏడాదంతా పాడవకుండా ఉంటుంది. 


పుదీనా లాభాలు
పుదీనా తినడం వల్ల కలిగే లాభాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. రోజూ తినాల్సిన ఆహారపదార్థాలలో పుదీనా కచ్చితంగా ఉంటుంది. దీన్ని అందరూ కూరలకు వాసనను, రుచిని ఇచ్చే అదనపు ఆహారంగానే చూస్తారు. నిజానికి పుదీనాను ప్రధానంగా చేసుకుని ఎన్నో వంటలు చేసుకోచ్చు. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. పుదీనా పచ్చడి అదిరిపోతుంది. ఇక పుదీనా పొడి నోరూరించేస్తుంది. దీన్ని తినడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కడుపునొప్పి తగ్గించడంలో ముందుంటాయి. దీనిలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.పాలిచ్చే తల్లులకు పుదీనా ఎంతో మేలు చేస్తుంది. నోటి దుర్వాసనను పొగొడుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్, విటమిన్ ఎ, ఐరన్, మాంగనీస్, ఫొలేట్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. 


మొటిమలను పోగొట్టే శక్తి కూడా మొటిమలకు ఉంది. దీని సాలిసిలిక్ ఆమ్లం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై జిడ్డు పేరుకుపోకుండా కాపాడతాయి. తద్వారా మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. పుదీనా ఆకుల పేస్టును ముఖానికి రాసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. గాయాలు తగిలినప్పుడు త్వరగా మానాలంటే పుదీనా ఆకుల రసాన్ని పూస్తే మంచిది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించడంలో కూడా సహకరిస్తుంది. 


Also read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి


Also read: అత్యంత అరుదైనది బాంబే బ్లడ్ గ్రూప్, దానికి ఓ నగరం పేరు ఎలా వచ్చింది?