Facts about India National Anthem:
జాతీయ గీతం ఆలపిస్తుంటే అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోతాయి. తెలియకుండానే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. అందులో ఉన్న వైబ్రేషన్ అలాంటిది. బెంగాలీ రచయిత నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతంలో ప్రతి పదం దేశభక్తికి అద్దం పడుతుంది. ఆలపిస్తున్నంత గర్వంతో ఉప్పొంగిపోతాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ సారి జరగనున్న స్వాతంత్య్ర వేడుకలు ఎంతో ప్రత్యేకంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే..."జనగణమన" గీతానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
1. ఈ గీతాన్ని నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రచించింది కూడా ఠాగూరే.
2. రోజూ పాఠశాలల్లో ఉదయం ప్రార్థన చేసే సమయంలో జాతీయ గీతం ఆలపిస్తారు. మరి మొట్టమొదటి సారి ఈ గీతాన్ని ఎప్పుడు పాడారో తెలుసా.? 1942 సెప్టెంబర్ 11వ తేదీన హాంబర్గ్‌లో. అయితే మొట్టమొదటిసారి ఈ గీతాన్ని భారతీయతకు తగ్గట్టుగా మార్పులు చేసింది మాత్రం 1911 డిసెంబర్ 16న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో.
3.1950 జనవరి 24న కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ (Constituent Assembly) ఈ జాతీయ గీతాన్ని ఆమోదించింది. అప్పుడే భారతదేశానికి "జనగణమన"ను జాతీయగీతంగా అధికారికంగా ప్రకటించారు. అన్ని భాషలు, మతాలకు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ గీతం.
4.నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్కృతం, బెంగాలీ పదాలతో ఉన్న జనగణమన గీతాన్ని ఉర్దూ-హిందీలోకి అనువదించాలని భావించారు. ఆయన ఆకాంక్ష మేరకు ఆ బాధ్యతను కేప్టెన్ అబిద్ అలీ తీసుకున్నారు. ఆయన హిందీలోకి అనువదించగా...కేప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్ స్వరపరిచారు. అదే "సుభ్ సుఖ్ చెయిన్" గీతం.
5.ఈ జాతీయ గీతాన్ని ఇంగ్లీష్‌లోకి కూడా అనువదించారు. దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. ఈ గీతానికి మ్యూజికల్ నొటేషన్స్‌ని ప్రఖ్యాత ఆంగ్లో-ఐరిష్ రచయిత జేమ్స్ హెచ్ కజిన్స్ సతీమణి మార్గరెట్ రచించారు. ఏపీలోని మదనపల్లిలో బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్‌కు ఆమె అప్పట్లో ప్రిన్సిపల్‌గా ఉన్నారు.
6.స్వాతంత్య్ర గీతాలాపన 52 సెకండ్లలో ముగించాలన్నది నిబంధన. కానీ చాలా మంది 54 సెకండ్లలో పూర్తి చేయాలని అనుకుంటారు.
7.జాతీయ గీతాన్ని ఆలపించటంలో భారతీయులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. తప్పనిసరిగా ఆలపించాల్సిందే అన్న నిబంధన లేదు. అందరూ ఆలపించే సమయంలో నిలబడి మౌనంగా ఉన్నంత మాత్రాన దేశాన్ని అవమానించినట్టు కాదు అని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు.
8.2005లో కొందరు ఓ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. జాతీయ గీతంలోని "సింధు" పదాన్ని తొలగించాలని దానికి బదులుగా "కశ్మీర్" అనే పదాన్ని చేర్చాలని వాదించారు. సింధు నది ప్రస్తుతం కశ్మీర్‌లోకి వెళ్లిపోయినందున పదం మార్చక తప్పదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
9.2015 జులై 7వ తేదీన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ మరో వాదన వినిపించారు. బ్రిటీష్ రూల్‌ని సూచించే "అధినాయక" అని పదాన్ని తీసేసి "మంగళ్" అనే పదాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది.
Also Read: Rakesh Jhunjhunwala: రూ.5000తో మొదలై రూ.40వేల కోట్లు ఆర్జించి! RJ ప్రస్థానం అనితర సాధ్యం!