Rakesh Jhunjhunwala: ఆర్జే..! అంటే మనందరికీ రేడియో జాకీ గుర్తొస్తాడు. స్టాక్ మార్కెట్ వర్గాలకు మాత్రం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గుర్తొస్తారు. సాధారణ ఆర్జే మాట్లాడితే సరదాగా అనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ ఆర్జే మాట్లాడితే రోమాలు నిక్కబొడుతుస్తాయి. ఈక్విటీ మార్కెట్లో ఆయనలా సంపద సృష్టించాలన్న స్ఫూర్తి ఉప్పొంగుతుంది. రూ.5000 పెట్టుబడిని రూ.40,000 కోట్లుగా మార్చిన ఆయన ధైర్యం, దూకుడు, పట్టుదల, తెలివితేటలు అనితర సాధ్యం!
రిటైల్ ఇన్వెస్టర్లకు నమ్మకం
రాకేశ్ ఏదైనా షేరు కొనుగోలు చేస్తున్నారని తెలిస్తే చాలు! వెంటనే దాని ధర ఆకాశానికి చేరుకుంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు వెనకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. ఆయన ఎంపికపై మార్కెట్ వర్గాలకు అంత నమ్మకం. అందుకే ఆయనను భారత వారెన్ బఫెట్‌గా పిలుచుకుంటారు. ఫోర్బ్స్ ప్రకారం దేశంలోని సంపన్నుల జాబితాలో ఆయనది 48వ స్థానం. హంగామా మీడియా, ఆప్టెక్ వంటి కంపెనీలకు ఛైర్మన్‌గా పనిచేశారు. వైస్రాయ్ హోటల్స్, కాన్‌కార్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నారు. స్టార్ హెల్త్, మెట్రో బ్రాండ్స్‌లో భాగస్వామి.
తండ్రి అడుగు జాడల్లో
కాలేజీలో చదివేటప్పుడే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు స్టాక్ మార్కెట్‌పై గురి కుదిరింది. సీఏ కోర్సులో చేరాక 1985లో దలాల్ స్ట్రీట్‌లో అరంగేట్రం చేశారు. కేవలం రూ.5000 పెట్టుబడితో ప్రస్థానం ఆరంభించారు. 2022, జులై నాటికి ఆ పెట్టుబడి విలువ రూ.40,000 కోట్లకు చేరుకుంది. తన తండ్రి మిత్రులతో చర్చించేటప్పుడు స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెరిగిందని ఆర్జే గతంలో చెప్పారు. తండ్రి చెప్పినట్టుగా ప్రతిరోజూ వార్తా పత్రికలు చదవి మార్కెట్ ఒడుదొడుకుల గురించి తెలుసుకొనేవారు.
అప్పు తీసుకొని పెట్టుబడి
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు తండ్రి అనుమతించినా డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దాంతో తన మిత్రుల వద్ద రాకేశ్ అప్పు తీసుకున్నారు. మొదట్లో ఆయన దూకుడుగా ఉండేవారు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ రాబడి అందిస్తానంటూ తండ్రి క్లయింట్ల వద్ద డబ్బు తీసుకున్నారు. 1986లో ఆయన రూ.43 చొప్పున 5000 టాటా టీ షేర్లను కొనుగోలు చేశారు. మూడు నెలల్లోనే ఆ షేరు ధర రూ.143కు పెరిగింది. మూడేళ్లలోనే ఆయన మార్కెట్ నుంచి రూ.20-25 లక్షలు ఆర్జించారు. ఆపై టైటాన్, క్రిసిల్, సీసా గోవా, ప్రాజ్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, ఎన్‌సీసీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. 2008 అంతర్జాతీయ మాంద్యంతో ఆయన పోర్టుపోలియో విలువ 30 శాతం క్షీణించినా 2012కు రికవర్ అయ్యారు.
రేఖతో వివాహం
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా 1960, జులై 5న ముంబయిలో జన్మించారు. అక్కడే ఆయన తండ్రి ఆదాయపన్ను శాఖా అధికారిగా పనిచేసేవారు. 1985లో సిడెన్‌హామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి సీఏ కోర్సులో చేరారు. ఆ తర్వాత రేఖను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కలిసి రేర్ ఎంటర్‌ప్రైజెస్ స్థాపించారు. ఈ కంపెనీ టైటాన్, క్రిసిల్, అరబిందో ఫార్మా, ప్రాజ్ ఇండస్ట్రీస్, ఎన్‌సీసీ, ఆప్టెక్, ఐయాన్ ఎక్స్‌ఛేంజ్, ఎంసీఎక్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, లుపిన్, వీఐపీ ఇండస్ట్రీస్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ర్యాలీస్ ఇండియా, జుబిలంట్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్వెస్ట్ చేసింది.
సమాజం కోసం
స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించాక రాకేశ్‌కు పార్టీ కల్చర్ అలవాటైంది. విపరీతంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం విలువ తెలుసుకున్నాక ఆయనలో మార్పు వచ్చింది. దానగుణం పెరిగింది. 2020లో తన సంపదలో 25 శాతాన్ని సమాజం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడే చిన్నారులకు సాయపడే సెయింట్ జూడ్, అనాథల కోసం పనిచేసే అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌కు భూరి విరాళాలు ఇచ్చారు. అశోకా విశ్వవిద్యాలయం, ట్రైబల్ సొసైటీ, ఒలింపిక్ గోల్డ్‌క్వెస్ట్‌కు సాయపడ్డారు. 15,000 మందికి కంటి ఆపరేషన్లు చేసే ఓ కంటి ఆసుపత్రిని ముంబయిలో నిర్మించారు.