Garbage Tax: "అధికారులు మాకు ఇచ్చిన సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాం. చేయూత పథకం కావాలంటే ప్రతి ఒక్కరూ చెత్త పన్ను చెల్లించాలి" అంటూ ఆర్పీలు చేసిన ఆడియో మెసేజ్ లు వాట్సాప్ లలో కలకలం రేపుతున్నాయి. శుక్రవారం వచ్చిన ఈ మెసేజ్ లతో చాలా మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త పన్నుకు, రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూత పథకాలకు సంబంధం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూత పథకం కింద ఏడాదికి రూ. 18,750 చెల్లిస్తోంది. లబ్ధిదారుల్లో 90 శాతం వరకు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని అధికారులు అంచనా వేశారు. 


చెత్త రుసుములు చెల్లిస్తేనే.. చేయూత పథకం! 
చాలా కాలం నుంచి చెత్త సేకరణకు సంబంధించిన ఛార్జీలను ఎవరూ చెల్లించట్లేదు. దీంతో అధికారులు చెత్త సేకరణ రుసుములు చెల్లించాలంటూ డ్వాక్రా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇందుకు పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు చేయూత పథకం వర్తించదని కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఆడియో మెసేజ్ లు పంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై విశాఖ మహా నగర పాలక సంస్థ యూసీడీ పీడీ పాపునాయుడిని వివరణ కోరగా... రిసోర్స్ పర్సన్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నారని, చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేసిన ఆదర్శంగా నిలవాలని సూచించినట్లు తెలిపారు. ఛార్జీలు చెల్లించని వారికి చేయూత పథకం నిలిపి వేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. చెత్త ఛార్జీలు చెల్లించాలని... అవి చెల్లించకపోయినా యథాతథంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని పేర్కొన్నారు.  


అర్హులైన వారికి రూ.75 వేలు..


ఏపీ సర్కారు ప్రవేశ పెట్టి వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేకూరుతాయి. ఒక్కో విడత కింద రూ. 48750 లభిస్తాయి. ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. చేయూత పథకంలో చేరాలని భావించే వారు కచ్చితంగా అర్హతలు కల్గి ఉండాలి. 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కల్గిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.


వైఎస్సార్ చేయూతకు అప్లై చేస్కోవాలని అనుకునే వాళ్లు చిరునామా రుజువు, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, వయసు రుజువు, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, మెబైల్ నంబర్, రేషన్ కార్డు.. వీటన్నిటిని తీస్కెళ్లి దరఖాస్తు చేస్కోవచ్చు. వైఎస్సార్ చేయూత పథకం కింద మరో ప్రయోజనం కూడా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అర్హత కల్గిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు యూనిట్లు కూడా ఏర్పాటు చేయిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్, రిలయన్స్, పీ అండ్ జీ ఐటీసీ వంటి పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.