History Of Indian National Flag:
జాతీయ జెండా అంటే ఓ ఎమోషన్. జెండాని గౌరవంగా ఎగరేసి ముందు నించుని సెల్యూట్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్‌కు ఏదీ సాటి రాదు. అంత భావోద్వేగాన్ని కలిగించే జాతీయ జెండాతో మన అనుబంధాన్ని ఇంకా పెంచేందుకు ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. కొందరు సోషల్ మీడియాలోనూ జెండాను డీపీగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో...ఓ సారి మన త్రివర్ణ పతాక చరిత్రను మననం చేసుకుందాం.
1.మన జాతీయ జెండాను తొలిసారి 1906లో ఆగస్టు 7వ తేదీన ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోలకత్తాలో పార్సీ బగన్ స్క్వేర్ వద్ద జెండా ఎగరేశారు. అప్పటికి త్రివర్ణ పతాకంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులున్నాయి.
2.భారత్‌కు ప్రత్యేకంగా జెండా ఎందుకు ఉండాలో, అది ఎంత కీలకమో గాంధీజీ అప్పట్లో వివరించారు. "జాతీయ జెండా అనేది అన్ని దేశాలకూ కీలకం. లక్షలాది మంది ఆ జెండా కోసమే ప్రాణాలర్పించారు. భారతీయులకు, ముస్లింలకు,క్రిస్టియన్లకు, పార్సీలకు...ఇలా ప్రజలందరి అస్తిత్వానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే జెండా చాలా అవసరం" అని బాపూజీ అన్నారు.
3.ఆ తరవాత జెండాలో మార్పులు చేశారు. ఈ రెండో త్రివర్ణ పతాకాన్ని 1907లో మేడమ్ కామా పారిస్‌లో ఆవిష్కరించారు. అయితే ఈ జెండా..దాదాపు మొదటి జెండాను పోలి ఉండేది. అంతకు ముందు జెండాలో ఉన్న కమలం పువ్వు స్థానంలో నక్షత్రాలను చేర్చారు. సప్తరుషులకు సంకేతంగా ఇలా మార్పులు చేశారు.
4.ఇక మూడో జాతీయ జెండాను 1917లో డాక్టర్ అనీబిసెంట్, లోకమాన్య తిలక్ కలిసి ఆవిష్కరించారు. హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా ఇలా జెండా ఎగరేశారు. మొదటి రెండు జెండాల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉండేది. ఎరుపు, ఆకుపచ్చ రంగులతోపాటు యూనియన్ జాక్ కూడా జోడించారు. ఏడు నక్షత్రాలను సప్తరుషులకు సంకేతంగా ఉంచారు.
5. 1921లో నాలుగో జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీని కలిసి ఆ జెండాను చూపించారు. ఈ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. హిందు, ముస్లింలకు సంకేతంగా ఉన్న ఈ రంగులకు తెలుపు రంగునీ జోడించారు మహాత్మా గాంధీ. దేశ అభివృద్ధికి చిహ్నంగా జెండా మధ్యలో అశోక చక్రాన్ని జోడించారు.
6. త్రివర్ణపతాక చరిత్రలో 1931 ఏడాదిని కీలక మలుపుగా చెప్పుకోవాలి. ఆ ఏడాదే మన మూడు రంగుల జెండాను అధికారికంగా ఆమోదించాలని తీర్మానించారు. ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని చేర్చారు. ఇన్ని మార్పుల తరవాత మనం ఇప్పుడు చూస్తున్న త్రివర్ణ పతాకానికి రూపకల్పన జరిగింది.
కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి.
Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?