Netizens trolling Hrithik Roshan for supporting Aamir Khan : పాపం... హృతిక్ రోషన్! ఒక్క ట్వీట్ ఇంత పని చేస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఆయన దృష్టికి వెళ్లిందో? లేదో? గానీ... ఆల్రెడీ జగరాల్సిన నష్టం జరుగుతోంది. సోషల్ మీడియాలో హృతిక్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే... 


ఆమిర్ ఖాన్ (Aamir Khan) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha). ఈ సినిమా బావుందని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. ''ఇప్పుడే 'లాల్ సింగ్ చడ్డా' చూశాను. ప్లస్సులు, మైనస్సులు పక్కన పెడితే.. ఈ సినిమా ఒక అద్భుతం. మిస్ అవ్వొద్దు... వెళ్లి సినిమా చూడండి. ఇదొక అద్భుతం'' అని హృతిక్ పేర్కొన్నారు.
 
'లాల్ సింగ్ చడ్డా' విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలో దేశంలో అసహనం పెరుగుతోందని, 'పీకే' సినిమాలో హిందువులను కించపరిచేలా సన్నివేశాలు రూపొందించారని, వగైరా వగైరా కారణాలు చూపి 'బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా' (Boycott Laal Singh Chaddha) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఆమిర్ సినిమా విడుదల అయ్యింది. ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనుకోండి. అయితే... ఆమిర్ సినిమాను ప్రశంసించడంతో నెటిజనుల కోపం హృతిక్ సినిమా మీదకు మళ్ళింది. 


తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన 'విక్రమ్ వేద' సినిమా హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటీనటులుగా రూపొందుతోంది. తమిళ సినిమా తీసిన దర్శక ద్వయం పుష్కర్ - గాయత్రి హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ సినిమాను పొగడటంతో హృతిక్ 'విక్రమ్ వేద' సినిమాను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పిలుపు ఇస్తున్నారు. దాంతో హృతిక్ రోషన్ ఎరక్కపోయి ఇరుక్కున్నాడని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు త్రిల్ చేస్తున్నారు.


Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
   
హాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్, ఆరు ఆస్కార్స్ అందుకున్న 'ఫారెస్ట్ గంప్' (Forrest Gump Hindi Remake) కు 'లాల్ సింగ్ చడ్డా' రీమేక్. హాలీవుడ్ సంగతి పక్కన పెడితే... బాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఫిల్మ్ అనిపించుకుంది. విమర్శకుల నుంచి సినిమాకు సరైన ప్రశంసలు రాలేదు. ప్రేక్షకులు కూడా అంతగా ఆదరించలేదని వసూళ్లు చూస్తే తెలుస్తోంది. 'లాల్ సింగ్ చడ్డా'లో అతిథి పాత్ర చేసినందుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మీద సైతం ఆగ్రహం వ్యక్తం అయ్యింది. కొంత మంది ఆయన సినిమా 'పఠాన్'ను బాయ్ కాట్ చేస్తామని సోషల్ మీడియాలో హెచ్చరించారు. 'బాయ్ కాట్ పఠాన్' హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ (boycott pathan trending) అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండ్ చూస్తుంటే... సెలబ్రిటీలకు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే రోజులు పోయినట్లు ఉందని కొంత మంది ట్వీట్ చేస్తున్నారు.   


Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.