" ఇద్దరు ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారు. ఓ హోటల్ గదిలో రూమ్ తీసుకున్నారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. రెయిడింగ్ జరుగుతుందేమో అని భయపడి అప్పటికప్పుడు కుర్చీ విరగ్గొట్టేసి.. మంట వేసి ఏడు అడుగులు నడిచేస్తారు. అలా పోలీసులు తలుపు తీయగానే ఇలా ఏడో అడుగు వేసేస్తారు. దీంతో పోలీసులు షిట్ అనుకుని .. వారు భార్యభర్తలు అని ఫిక్సయిపోయి అక్కడ్నుంచి వెళ్లిపోతారు.." ... ఇదంతా చదువుతూంటే ఇలాంటి సీన్లు ఉన్న సినిమాలు చాలా చూశానని మీకు గుర్తొచ్చే ఉంటుంది. పాత సినిమాల్లో ఇవి చాలా రొటీన్ సీన్లు. వీటిని చూసి ఇన్‌స్పయిర్ అయ్యారో లేకపోతే నిజంగానే అలాంటి పరిస్థితులు వచ్చాయో కానీ.. పంజాబ్‌కు చెందిన ఓ జంట అచ్చంగా ఇలానే హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కావాలంటూ కోర్టుకెళ్లారు. కానీ అక్కడ సినిమా స్టైల్లో హ్యాపీ ఎండింగ్ రాలేదు. కోర్టు చీవాట్లు పెట్టి రూ. పాతిక వేల ఫైన్ వేసింది.
Also Read : 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది ఎప్పుడో తెలుసా!
తాము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ జంట పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఆ సందర్భంగా పెళ్లి చేసుకున్నట్లుగా సాక్ష్యాలు చూపించాలని కోర్టు అడిగింది. అప్పుడు పెళ్లి కొడుకు అతి తెలివి తేటలు చూపించాడు. తాము హోటల్ గదిలో గ్యాస్ స్టౌవ్ మీద మంట పెట్టి ఏడు అడుగులు నడిచామని.. తాను ఆమె నుదుట సింధూరం దిద్దానని చెప్పుకొచ్చారు. ఇక ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆ పెళ్లి కొడుకు చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు.
Also Read : దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 14,313 మందికి వైరస్
తర్వాత వారి వయసులు తెలుసుకుని మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఆ పెళ్లి కూతురు వయసు ఇరవై ఏళ్లు కాగా.. పెళ్లి కొడుకు వయసు 19 ఏళ్ల ఐదు నెలలు మాత్రమే. అంటే పెళ్లి కొడుక్కి చట్ట ప్రకారం పెళ్లి వయసు రాలేదన్నమాట. వాళ్లిద్దరూ చేసుకున్న పెళ్లి చెల్లుబాటు అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే అతడికి వివాహ వయసు లేకపోవడంతో హైకోర్టు అది చెల్లుబాటు అయ్యే పెళ్లి కాదని తేల్చేసింది. వెంటనే వారికి రూ. పాతిక వేల జరిమానా కూడా విధించింది. అతను మంచి బుద్దితో హైకోర్టును ఆశ్రయించలేదని .. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
అయితే పెద్దలు వారి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉండంతో వారి ప్రాణాలకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని.. పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఆ ప్రేమ జంట ఎలా అయినా తమ పెళ్లి అయిందని నిరూపించాలనుకున్నారు కానీ.,. సినిమా స్టైల్లో వర్కవుట్ కాక ఫైన్ కట్టాల్సి వచ్చింది.