Cartwheel Galaxy: మీరు చిన్నప్పుడెప్పుడైనా పిల్లి మొగ్గలేసుకుంటూ వెళ్లారా? వంగి భూమిపై చేతులు ఆన్చి కాళ్లు రెండూ అలా గాల్లోకి లేపి పిల్లి మొగ్గలేసుకుంటూ వెళితే భలే సరదాగా ఉంటుంది కదా. సరిగ్గా స్పేస్ లో అలానే ప్రవర్తిస్తున్న ఓ గెలాక్సీని ఫోటోలు తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీపావళి రోజు కాల్చే భూ చక్రంలా గిరాగిరా తిరుగుతున్నట్లు కనిపించే ఈ కార్ట్ వీల్ గెలాక్సీని నాసా జేమ్స్ వెబ్ అద్భుతంగా ఫోటోలు తీస్తే...నాసా వాటిని షేర్ చేసింది.
ఎక్కడుందీ కార్ట్ వీల్ గెలాక్సీ
భూమి నుంచి 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడో Sculptor constellationలో ఈ కార్ట్ వీల్ గెలాక్సీ ఉంది. వాస్తవానికి ఓ పెద్ద స్పైరల్ గెలాక్సీ ఇంకో చిన్ని గెలాక్సీ చాలా బలంగా ఢీ కొట్టుకోవటం వలన ఇంత పెద్ద బండి చక్రం లాంటి గెలాక్సీ ఏర్పడింది. ఫోటోలో ఓ సారి చూడండి. ఆ కనిపిస్తున్న గెలాక్సీలో లేత గులాబీలో రంగులో కనిపిస్తున్నది ఒక గెలాక్సీ అయితే...దాంట్లోనే కలిసిపోతున్నట్లు కనిపిస్తున్న బ్లూ కలర్ ఇంకో గెలాక్సీ అన్న మాట. ఆ రెండు గెలాక్సీలు అంత బలంగా ఢీ కొన్నాయి కాబట్టి ఇంత పెద్ద చక్రంలా కనిపిస్తోంది.
మనం చెరువులో రాయి వేస్తే.. ఆ రాయి పడిన చోట చుట్టూ ఎలా అలల్లా వస్తాయి అచ్చం అలానే. నిజానికి ఈ కార్ట్ వీల్ గెలాక్సీని హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2018 లోనే ఫోటోలు తీసింది. కానీ విపరీతమైన డస్ట్ పార్టికల్స్ కారణంగా అప్పుడు సరిగ్గా కనిపించలేదు ఈ గెలాక్సీ. ఇప్పుడు ఇన్ ఫ్రారెడ్ కిరణాలతో పని చేసే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో చాలా స్పష్టంగా ఈ గెలాక్సీ కనిపిస్తూ సందడి చేస్తోంది.
జేమ్స్ వెబ్ ఫోటో ఏం చెబుతోందంటే
మనకి ఈ ఫోటోలో ఇంత చిన్నగానే ఉంది కదా అన్నట్లు కనిపిస్తున్నా...ఈ గెలాక్సీ మొత్తం 440 మిలియన్ సంవత్సరాలు విస్తరించి ఉంది. ఆ లోపల కనిపిస్తున్న రింగ్ నుంచి వస్తున్న విపరీతమైన రేడియంట్ ఎనర్జీ కారణంగా ఔటర్ రింగ్ విస్తరిస్తూ వెళుతూనే ఉందన్నమాట. ఆ క్రమంలో నే ఔటర్ రింగ్ సమీపంలో చాలా నక్షత్రాలు, సూపర్ నోవాలు ఉద్భవిస్తున్నాయి ఆ గెలాక్సీలో అచ్చం మన పాలపుంత గెలాక్సీలాంటి పోలికలే ఈ కార్ట్ వీల్ గెలాక్సీకి కూడా ఉన్నాయంట. అంతే కాదు దీని పక్కనే ఇంకో రెండు గెలాక్సీలు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించాయి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో ఉన్న Near Infrared Camera (NIRCam) ఈ కార్ట్ వీల్ గెలాక్సీని చాలా అందంగా క్యాప్చర్ చేసింది. ఫోటోనే తీయటం అయితే హబుల్ కూడా తీస్తుంది. కానీ మన జేమ్స్ వెబ్ ఇంకా స్పెషల్ కదా. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లోని Mid Infrared Instrument (MIRI) ఆ గెలాక్సీ నుంచి వస్తున్న లైట్ ను కూడా స్టడీ చేసింది. ఆ గెలాక్సీలో హైడ్రో కార్బన్లు పుష్కలంగా ఉన్నాయని మిరీ గుర్తించింది. అంతే కాదు ఇంకా చాలా కెమికల్ కాంపౌడ్లు కూడా ఉన్నాయంట. ప్రత్యేకించి అచ్చం భూమి మీద ఉన్నట్లుగానే సిలికేట్ డస్ట్ కూడా ఆ గెలాక్సీ నుంచి వస్తున్న లైట్ లో గుర్తించింది జేమ్స్ వెబ్.
ఎలాంటి ఉపయోగం ఉండనుంది..?
ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసిన ఈ ఫోటోల ఆధారంగా అసలు గెలాక్సీలు ఎలా ఏర్పడుతున్నాయి..నక్షత్రాల పుట్టుక...ఇంకా అచ్చం భూమి లాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని మన శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. జేమ్స్ వెబ్ ఇప్పుడు తీసిన ఈ కార్ట్ వీల్ గెలాక్సీ కి సంబంధించి గతంలో హబుల్ తీసిన పాత ఫోటోలను కూడా అందుబాటులో ఉంచింది. సో సైన్స్ లవర్స్...స్పేస్ లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న ఈ అథ్లెట్ గెలాక్సీ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: James Webb Telescope : విశ్వం గుట్టు వీడుతోందా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫస్ట్ ఫొటోలు ఏం చెబుతున్నాయ్!